పరకాలలో ఆశా కార్యకర్తల ధర్నా

పరకాలలో ఆశా కార్యకర్తల ధర్నా
- మూడు నెలల నుండి జీతాలు లేవు
- ఎన్నికల ముందు సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలో తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల (ఆశా) సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బుధవారం రోజు మధ్యాహ్నం పట్టణంలోని బస్టాండ్ కూడలి వద్ద ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు.
పెండింగ్ పారితోషకాలు వెంటనే విడుదల చేయాలని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశా కార్యకర్తలకు 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, 1000 జనాభాకు ఒక ఆశా కార్యకర్తను నియమించాలని వారు డిమాండ్ చేశారు. గత మూడు నెలల నుండి జీతాలు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల మండల గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల (ఆశా) సంఘం నాయకురాళ్లు పాల్గొన్నారు.
