ఈ నెల 13న గన్నవరంలో సీఎం చంద్రబాబు పర్యటన

ఈ నెల 13న గన్నవరంలో సీఎం చంద్రబాబు పర్యటన
సూరంపల్లిలో ‘అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులను విడుదల చేయనున్న సీఎం
సభా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే వెంకట్రావు, జిల్లా అధికారులు
గన్నవరం, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 13వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులను పీఎం – కిసాన్ నిధులతో కలిపి గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం నుండి విడుదల చేయనున్నారు.
ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు వీరంకి వెంకట గురుమూర్తి, ఆర్డీఓ బాలసుబ్రమణ్యం, జాయింట్ కలెక్టర్ నవీన్ , జిల్లా ఎస్పీ విద్యాసాగర్ , ఎంఆర్ఓ శివయ్య ఇతర జిల్లా అధికారులతో కలిసి బుధవారం క్షేత్రస్థాయి లో పరిశీలించారు.
అధికారులు సమన్వయంతో పని చేసి ఎటువంటి లోటు జరగకుండా చూడాలని సూచించారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో సభకు వచ్చే వారికీ మంచినీరు అందించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అస్సాంలోని గౌహతి లో ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు గన్నవరం మండలం సూరంపల్లి వేదికగా రాష్ట్రంలోని 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,808 కోట్లు నేరుగా జమ చేస్తారని తెలిపారు.
రైతులకు కేంద్రం ఇచ్చే రూ. 2,000లకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 4,000 కలిపి మొత్తం రూ. 6,000 లను ఈ విడతలో అందజేస్తోందని వివరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గన్నవరం వేదికగానే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసారని అన్నారు. గతంలో కేంద్ర మంత్రి అమిత్ షా తో కలిసి చంద్రబాబు ఎన్డీఆర్ఎఫ్ భవన ప్రారంభోత్సవానికి ఇక్కడికే వచ్చారని యార్లగడ్డ గుర్తుచేశారు. ఇప్పుడు మూడో విడత నిధుల విడుదల కోసం మళ్ళీ సూరంపల్లి గ్రామానికి రావడం యాదృచ్ఛికమని, ఇది నియోజకవర్గ ప్రజల అదృష్టమని ఆయన పేర్కొన్నారు.
గతంలో మొదటి విడత ప్రకాశం జిల్లా దర్శిలో, రెండో విడత కడప జిల్లా కమలాపురంలో జరగ్గా,, ఇప్పుడు మూడో విడత కృష్ణా జిల్లా గన్నవరంలో జరగనుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం భారీ నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపడానికి రైతులందరూ భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమ విజయవంతం కోసం నీటి సంఘాల అధ్యక్షులు, పీఏసీఎస్ చైర్మన్లు, పాల కేంద్రాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలుకుతామని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని స్పష్టం చేశారు.
