CM Chandrababu | ప్రతిపక్షానిది బోగస్ ప్రచారం

CM Chandrababu | ప్రతిపక్షానిది బోగస్ ప్రచారం
- భోగాపురం ఎయిర్ పోర్టుపై అసత్య ప్రచారం
- చంద్రబాబు కృషితోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్ కల సాకారం
- పల్లెల్లో రహదారుల అభివృద్ధికి కృషి
- మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
CM Chandrababu | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : భోగాపురం ఎయిర్ పోర్టుపై ప్రతిపక్ష పార్టీ బోగస్ ప్రచారం చేస్తుందని, సీఎం చంద్రబాబు(CM Chandrababu) కృషితోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ కల సాకారమైందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో రూ.25 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిమెంట్ రహదారుల నిర్మాణానికి, రూ.36 లక్షల 15వ ఆర్థికసంఘం నిధులతో హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఈ రోజు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భోగాపురం ఎయిర్ పోర్టు(Airport) విషయంలో ఎవరికో పుట్టిన బిడ్డ మేమే కారణం, మేమే పెంచాం అనే పరిస్థితులు దాపురించాయన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు పనులను అప్పట్లో సీఎం చంద్రబాబు ప్రారంభించారన్నారు. ఎన్నో పత్రికా సమావేశాల్లో అక్కడకు ఎర్రబస్సు వెళ్లదు… అభివృద్ధి(Development) లేని ప్రాంతమది అని అప్పట్లో ప్రతిపక్ష నేత విమర్శించాడన్నారు.

40 కిలోమీటర్ల పరిధిలోనే ఎయిర్ పోర్టు ఉంటే అక్కడికి ఎవరు వస్తారని ఎన్నో హేళనలు చేశారన్నారు. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ కల సాకారం అవుతుంటే అది నేనే చేశాను అంటూ నిస్సిగ్గుగా ప్రతిపక్ష పార్టీ, అతని గ్యాంగ్ చెప్పుకోవడం దురదృష్టకరమని అన్నారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల అభివృద్ధికి చర్యలు చేపడితే కోటి సంతకాలని డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.
ఇకనైనా హుందాగా వ్యవహరించాలని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అలజడులు సృష్టించి, గొడవలు చేసి, గందరగోళ పరచాలని ప్రయత్నం చేసి చివరకు తను తీసిన గోతిలో తానే పడి జైలు(prison)లో కూర్చున్న వ్యక్తులకు సూచించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో హుందాగా వ్యవహరిద్దామన్నారు. ప్రజల మధ్యన వైషమ్యాలు రెచ్చగొడుతూ దిగజారి రాజకీయాలకు పాల్పడుతూ తద్వారా తన రాజకీయ పబ్బం గడుపుకుందామంటే ప్రజలకు మంచిది కాదని, నియోజకవర్గ పరిధిలోని ప్రధాన ప్రతిపక్ష నేతకు సూచించారు.
ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం ఇప్పటికీ రూ.12.29 కోట్లు మంజూరు చేశామన్నారు. మైలవరం నియోజకవర్గంలో దాదాపుగా 95 శాతా(95 percent)నికి పైగా ప్రధాన రహదారుల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గుంటుపల్లిలో ఎస్సీ ఏరియాలో కమ్యూనిటీ ఏర్పాటుకు త్వరలోనే నిధులు(funds) కేటాయిస్తామన్నారు. కొండపల్లి ప్రధాన సెంటర్‌లో మెయిన్ రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ అఖిలపక్ష నేతలు అందరూ కొండపల్లి ప్రధాన రోడ్డు అభివృద్ధికి విజ్ఞప్తి చేశారన్నారు. పల్లెపండుగ 2.0తో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల రూపురేఖలు మారుతున్నాయన్నారు. హెల్త్ సెంటర్ నిర్మాణాలతో పేదలకు ఉచిత వైద్యం మరింత చేరువ అవుతుందన్నారు. పనుల్లో నాణ్యత తప్పనిసరిగా పాటించాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
