CENTRAL | సీఐటీయు నాయకులు డిమాండ్

CENTRAL | సీఐటీయు నాయకులు డిమాండ్
4 లేబర్ కోడ్ల అమలుకు ఇచ్చిన నోటిఫికేషన్ ఉపసంహరించాలి
CENTRAL | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 4 లేబర్ కోడ్ల నోటిఫికేషన్ తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయు నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద 4 లేబర్ కోడ్ల ప్రతులను దగ్దం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సీపెల్లి రవీందర్, ఎండి ఖాజా, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కళ్లేపల్లి అశోక్ (Kallepalli Ashok) మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వేతనాల కోడ్ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020), సామాజిక భద్రతా కోడ్ (2020), వృత్తిపరమైన భద్రతా, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ (2020) నవంబర్ 21, 2025 నుండి అమలు చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలు, గరిష్ట లాభాల కోసం చేసిన నష్టదాయక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికవర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
కార్మిక నిబంధనలను, సంక్షేమాన్ని తుంగలో తొక్కి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే 29 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లు బిజెపి ప్రభుత్వం తెచ్చిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం (Central Govt) కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే పని చేస్తోందని దుయ్యబట్టారు. లేబర్ కోట్ల అమలుకు నిర్ణయించడంలో యాజమాన్యాల దోపిడీకి అంతే లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సావనపల్లి వెంకటస్వామి, నాయకులు మామిడిపల్లి తిరుపతి, జంగంపల్లి నరేష్, బందరీ అశోక్, కనకయ్య, శేఖర్, ఇమ్రాన్, ప్రజాసంఘాల నాయకులు శ్రావణ్, ఆర్ల సందీప్, జి. సురేష్, సూరజ్, తదితరులు పాల్గొన్నారు.
