Chittoor | ఇంటి దొంగలు దొరికారు..

Chittoor | ఇంటి దొంగలు దొరికారు..
- అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
- రూ.50 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం
Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : పలమనేరు పట్టణంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇంటి దొంగతనాలు, గొలుసు లాక్కోవడం వంటి నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రాయపాటి వెంకయ్య (49), షేక్ నాగుల్ మీరా (27), యక్కంటి తులసి రామిరెడ్డి (26)లను నిందితులుగా గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారు రూ.50 లక్షల విలువ గల 210 గ్రాముల బంగారు, వజ్రాల నగలు, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో రాయపాటి వెంకయ్యపై సుమారు 100 నేర కేసులు, షేక్ నాగుల్ మీరాపై సుమారు 75 నేర కేసులు, యక్కంటి తులసి రామిరెడ్డిపై సుమారు ఆరు నేర కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. పలమనేరు మాత్రమే కాకుండా పుంగనూరు, గంగవరం, బెంగళూరు, ముల్బాగల్, బంగారుపేట, కోలార్, కృష్ణగిరి ప్రాంతాల్లో కూడా వీరు నేరాలకు పాల్పడినట్టు విచారణలో తేలింది. నిందితుల్ల మహారాష్ట్ర చేసినందుకు పలమనేరు పోలీసులను జిల్లా పోలీసు అధికారి తుషార్ డూడి ప్రత్యేకంగా అభినందించి నగదు బహుమతి అందజేశారు.

కేసు నేపథ్యం ఇలా ఉంది…
2025 జూలై 15న పలమనేరు పట్టణంలోని అయ్యాకన్ను వీధిలో బాలాజీ నివాసంలో ఎవరూ లేని సమయంలో దొంగతనం జరిగింది. ఈ ఘటనపై జూలై 18న పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. జిల్లా పోలీసు అధికారి ఆదేశాల మేరకు పలమనేరు ఉప విభాగ పోలీసు అధికారి డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో మూడు రాష్ట్రాల్లో విస్తృతంగా విచారణ జరిపారు. ఈ క్రమంలో 2026 జనవరి 6న సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు చిత్తూరు, బెంగళూరు ప్రధాన రహదారిపై నాగమంగళం ఫ్లైఓవర్ వద్ద రాయపాటి వెంకయ్య, షేక్ నాగుల్ మీరా, యక్కంటి తులసి రామిరెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసిన 210 గ్రాముల బంగారంలో పుంగనూరులో జరిగిన ఇంటి దొంగతనానికి సంబంధించిన 76.660 గ్రాములు, పుంగనూరులో గొలుసు లాక్కోవడం కేసుకు చెందిన 13 గ్రాములు, కృష్ణగిరిలో గొలుసు లాక్కోవడం కేసుకు సంబంధించిన 13 గ్రాముల బంగారు గొలుసు, గంగవరం గొలుసు లాక్కోవడం ఘటనకు సంబంధించిన 23.47 గ్రాముల బంగారు గొలుసు ఉన్నట్లు పోలీసులు వివరించారు. విచారణలో ముగ్గురు నిందితులు తాము పలమనేరు, పుంగనూరు, గంగవరం, బెంగళూరు, ముల్బాగల్, బంగారుపేట, కోలార్, కృష్ణగిరి ప్రాంతాల్లో వరుస నేరాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.
