Chittoor | చిత్తూరు జేసీగా ఆదర్శ రామచంద్రన్

Chittoor | చిత్తూరు జేసీగా ఆదర్శ రామచంద్రన్

Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి ఆదర్శ్ రామచంద్రన్‌ను ప్రభుత్వం చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించింది. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఉన్న గొబ్బిళ్ళ విద్యాధరిని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్గా బదిలీ చేశారు.

2020 బ్యాచ్‌కు చెందిన ఈ యువ అధికారి ఆదర్శ్ రామచంద్రన్ క్రమశిక్షణ, సమర్థత, ప్రజల పట్ల స్పందనతో మంచి పేరు సంపాదించారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌లో వివిధ జిల్లాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. గతంలో నూజివీడు సబ్ కలెక్టర్‌గా, నెల్లూరులో జాయింట్ కలెక్టర్‌గా, ఎంఎస్ఎంఈ విభాగంలో సీఈఓగా, అనంతరం అన్నమయ్య జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయడం, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం, అవినీతికి తావులేని పాలన అందించడం ద్వారా అధికార వర్గాల్లోనూ, ప్రజల్లోనూ విశ్వాసాన్ని సంపాదించారు.

బదిలీ మీద చిత్తూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పేదల సంక్షేమ పథకాలు, భూ పరిపాలన వంటి కీలక రంగాల్లో చిత్తూరు జిల్లాకు కొత్త దిశానిర్దేశం చేస్తారని అధికారులు భావిస్తున్నారు. ప్రజలతో నేరుగా మమేకమై సమస్యలను పరిష్కరించే స్వభావం ఉన్న అధికారి కావడంతో జిల్లాలో పరిపాలన మరింత చురుగ్గా సాగుతుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. యూపీఎస్సీ 2019 సివిల్ సర్వీస్ పరీక్షలో 405 ర్యాంక్ సాధించిన ఆదర్శ్ రామచంద్రన్ 26 ఏళ్ల వయస్సులో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఆయన భార్య ఆదితి సింగ్ కూడా 2020 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కావడం విశేషం. యువతకు ఆదర్శంగా నిలిచేలా సేవా భావంతో పనిచేస్తున్న ఈ దంపతులు ప్రజాపాలనలో మంచి పేరు సంపాదిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, పారదర్శక పాలన వంటి అంశాల్లో ఆదర్శ్ రామచంద్రన్ కీలక పాత్ర పోషించనున్నారు.

Leave a Reply