Chittoor | యూరియా కొరత లేదు

Chittoor | యూరియా కొరత లేదు

  • రైతులు ఆందోళన చెందవద్దు
  • చిత్తూరు జిల్లా వ్యవసాయ అధికారి

Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్‌కు అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి జె. మురళీకృష్ణ తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రబీ సీజన్‌కు సంబంధించి జిల్లాలో అన్ని రకాల పంటల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 20,183 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 20 నాటికి జిల్లాలో 1,558 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ అందుబాటులో ఉందన్నారు. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు జిల్లాకు 5,747 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు 6,753 మెట్రిక్ టన్నులను జిల్లాకు సరఫరా చేసినట్లు వివరించారు. ఈ కాలంలో రైతులకు 4,712 మెట్రిక్ టన్నుల యూరియాను విక్రయించామని పేర్కొన్నారు. అదనంగా ఈ నెలాఖరులోగా మరో 500 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరుకోనున్నట్లు తెలిపారు.

సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతికంగా అభివృద్ధి చేసిన నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను ప్రోత్సహిస్తున్నామ‌ని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ నానో ఎరువులు ప్రస్తుతం రైతులకు అందుబాటులో ఉన్నాయని, సమతుల్య ఎరువుల వినియోగంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడులు మెరుగుపడతాయని చెప్పారు.

రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో బస్తాపై ముద్రించిన ధరను గమనించాలని, తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా, ఇతర ప్రాంతాలకు మళ్లించినా సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన డీలర్ల లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు ఎరువుల నియంత్రణ చట్టం–1985 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని, ఎలాంటి సమస్యలు ఎదురైనా సమీప రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా వ్యవసాయ అధికారి కోరారు.

Leave a Reply