వ్యవస్థలను పరిరక్షించుకోవాలి…

వ్యవస్థలను పరిరక్షించుకోవాలి…

వ్యవస్థలపట్ల విశ్వాసంతో మెలగాలి… చినజీయర్ స్వామి…

నర్సాపురం, ఆంధ్రప్రభ : ఏ వ్యవస్థ కైనా నిర్వాహకులు సేవకులుగా పనిచేస్తేనే ఆవ్యవస్థ సురక్షితంగా ఉంటుందని చినజీయర్ స్వామి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఎంబర్ మానార్ స్వామి ఆలయంలో చేపట్టిన రాజ గోపురం శంకుస్థాపన కార్య క్రమంలో ఆయన పాల్గొని భూమి పూజ చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్య క్రమంలో భక్తులను ఉద్దేశించి ఆయన సుమారు గంట సేపు ప్రసంగించారు. వ్యవస్థలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వ్యవస్థలపట్ల విశ్వాసంతో మెలగాలని ఆయన సూచించారు. గేట్ కీపర్ నుంచి చైర్మన్ వరకు అందరూ విశ్వాసంగా ఉండాలని అలాంటి వ్యక్తులనే నియమించాలని పరోక్షంగా తిరుపతి దేవస్థానం ను ఉద్దేశించి మాట్లాడారు. అలాంటప్పుడే ఆచార వ్యవహారాలు సంప్రదాయ పద్ధతిలో కొనసాగుతా యన్నారు.

పరిపాలకుడిగా ఉన్నప్పుడు తన మన బేధం లేకుండా వ్యవహరించాలని సూచించారు. ఆలయాలు ఆయా సంప్రదాయాలను పాటించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా రాజగోపురం నిర్మాణ దాతలను ఆయన అభినందించారు.

లోకెత్తర కార్యక్రమం లో భాగస్వామి కావాలి..

ఎంబర్ మానార్ స్వామి ఆలయ రాజ గోపురం నిర్మాణం మన హయాంలో జరగడం, ఈ కార్యక్రమంను వీక్షించడం మనం చేసుకున్న అదృష్టం అని చిన జీయర్ స్వామి తెలిపారు. లోక కల్యాణం కోసం చేపట్టిన ఇలాంటి ఆధ్యాత్మిక కార్య క్రమాలలో అందరూ భాగస్వాములు కావాలని చిన జీయర్ స్వామి భక్తులకు పిలుపు ఇచ్చారు. రాజగోపురం నిర్మాణం లో భక్తులు ఒక్కొక్కరు ఒక్కో ఇటుక తోబాటు తోచిన విధంగా విరాళం అందించి భక్తిని చాటుకోవాలని సూచించారు.

అయోధ్య లో జరిగిన రామాలయ నిర్మాణం కూడా మన హయాంలో జరగడం, చూడటం ఈ తరం చేసుకున్న పుణ్యమన్నారు. దేవుడు అందరివాడని, మన అనే భావంతో ముందుకు సాగాలని సూచించారు. రామానుజ సమాజం అంటే అందరు ఉంటారని, అందరూ బాగుండాలనేదే రామానుజ దివ్యనుజం అని తెలిపారు. ఆలయాలలో ఆచార వ్యవహారాలను సాంప్రదాయ పద్ధతిలో పాటించాలని తెలిపారు.

చరిత్ర కు రక్షకులు కావాలి…

దేశ, జాతి చరిత్రకు ప్రాణం పోసిన మహనీయులు పుట్టిన దేశం లో మనం ఉన్నాం. మనదేశ గొప్ప తనాన్ని చరిత్ర చెబుతుంది. జాతి చరిత్రను ఇతిహాసాలు చెబుతున్నాయి. చరిత్రను అనుసరించి నడుచుకొని చరిత్రను సంరక్షించుకోవాలి. జాతి చరిత్ర చెప్పే చదువులు కనుమరుగయ్యాయి. మన చదువుల్లో మహనీయులు చరిత్రలు ఉండేవి. అలాంటి చరిత్రలు తెలియజేసే చదువులు చెప్పాలి.

రామానుజ గోపుర నిర్మాణం లోక కల్యాణమే…

రామానుజ రాజ గోపురం నిర్మాణం లోక కల్యాణమే. ఈ గోపురం నిర్మాణం రామానుజ అంకితమై జరగాలి. రామానుజాచార్యులు లాంటి మహనీయులు చూపిన మార్గంలో నడుచుకోవడం మన అదృష్టం. రామానుజం దేశమంతా పర్యటించి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు గురించి ఆధ్యాత్మిక ప్రచారం చేశారు. భూదానం చేసిన మహనీయుడు రామానుజం. ప్రాచీనతకు ధీటుగా రాజగోపురం నిర్మాణం జరగాలి. రాజగోపురం చరిత్రకు చిహ్నం కావాలి.

అందరూ బాగుండాలి…

మనమంతా దేవుడు పిల్లలం… అందరూ ఒక్కటే. కుల మతాలకు తావివ్వకుండా అందరూ బాగుండాలి అని కోరుకోవాలి. భవిష్యత్ తరానికి మంచిని పంచాలి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. ఎదుటవారిని ప్రేమించాలి. పరాయివాడిని పాడుచేయకూడదు. భారత భూమిలో అనేక కులాలు, మతాలు ఉన్నాయి. అందరికీ నివాస స్థానం అయ్యింది. మనదేశం అందరినీ స్వాగతించింది. ఆధిత్యాన్ని ఇచ్చింది. అతిథిగా వచ్చిన వారు వెన్నుపోటు పొడిచిన వారిని ప్రేమించింది. అటువంటి దేశం లో పుట్టిన మనం అదృష్టవంతులం.

Leave a Reply