ఎలిగేడు (పెద్దపల్లి జిల్లా) ఆంధ్రప్రభ : అదొక‌ కుగ్రామం… రోడ్డు సైతం సరిగ్గా లేని పల్లె.. తండ్రి ఆశయాన్ని తన లక్ష్యంగా మార్చుకొని అహర్నిశలు శ్రమించి కన్న తండ్రి రుణం తీర్చుకుంది. తండ్రి సాధించలేనిది తాను సాధించి చరిత్ర సృష్టించింది. అంత‌ర్జాతీయ స్థాయి ఆర్చ‌రీలో ప్ర‌తిభ క‌న‌బ‌రిచి సొంత గ్రామమైన సుల్తాన్‌పూర్ ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు వ‌చ్చేలా చేసింది ఆ యువ‌తి… ఆమె ఎవ‌రో కాదు కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్షిప్ లో కాంపౌండ్ ఆర్చరి విభాగంలో స్వర్ణ ప‌త‌కాం సాధించిన తానిపర్తి చికిత.

చికిత స్వగ్రామం పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్. చికిత తండ్రి శ్రీనివాస రావుకు ఆర్చరీ అంటే ప్రాణం. విల్లు ఎక్కుపెట్టి బాణాలు స్పందించి భారతదేశానికి ప‌త‌కాలు తెచ్చి పెట్టాలని కలలుగన్నాడు.. కానీ ఆయన కల కలగానే మిగిలిపోయింది.

గ్రామీణ ప్రాంతంలో వసతులు లేక.. ప్రోత్సాహం అసలే లేక లక్ష్యాన్ని సాధించ లేకపోయాడు. అయితే శ్రీనివాస్ రావు కుమార్తె చికిత మాత్రం తండ్రి ఆశయాన్ని లక్ష్యంగా ఎంచుకొని ముందుకు సాగింది. తమ పొలాల్లోనే సాధన ప్రారంభించింది. గడ్డి వామునే లక్ష్యంగా బాణాలు సంధించింది.

ఏకాగ్రతతో సాధన చేసి ప‌త‌కాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చికిత ప్రయత్నం విజయవంతం కావడంతో భారత దేశంలో గతంలో ఎవరూ సాధించని విధంగా ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్ కాంపౌండ్ విభాగంలో బంగారు పతకం సాధించింది. కన్న తండ్రి కలలు సాకారం చేసింది.

భారత్ కు స్వర్ణ ప‌త‌కాం తెచ్చిన చికిత

కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం ప‌త‌కం సాధించి చికిత చరిత్ర సృష్టించింది. ఫైనల్లో యెరిన్ పార్క్ (కొరియా), సెమీ ఫైనల్ లో పౌలా డయాజ్ (స్పెయిన్), క్వార్టర్ ఫైనల్ లో పర్ణీత్ కౌర్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడించి ప్రపంచ విజేతగా నిలిచింది.

తొలి అడుగు సుల్తాన్ పూర్ లో…

ఆర్చరీ విభాగంలో ప్రపంచ విజేతగా నిలిచిన చికిత తొలి అడుగు స్వగ్రామమైన సుల్తాన్పూర్ లోనే వేసింది. తాను సాధించలేనిది తన కూతురు సాధించాలని ఆశపడ్డ శ్రీనివాసరావు ఆరేళ్ల వయసున్నప్పుడు చికితకు ఆర్చరీ నేర్పించాలని తలంచాడు.

కుమార్తెకు తానే కోచ్ అవతారం ఎత్తి హైదరాబాద్ కు వెళ్లి ఆర్చరీకి సంబంధించిన విల్లు, బాణాలు, ఇతర పరికరాలు కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. గ్రామంలోని తమ పొలంలోనే ఆర్చరీ సాధనకు శ్రీకారం చుట్టాడు.

వరి కోతలు పూర్తవడంతో గడ్డివామునే లక్ష్యంగా కూతురితో సాధన ప్రారంభించాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆకట్టుకున్న చికిత రెండేళ్ల లోనే జాతీయ స్థాయికి చేరుకుంది. జాతీయ సబ్ జూనియర్ ఆర్చరీలో వ్యక్తిగత విభాగంలో రజతం, మిక్స్డ్ విభాగంలో కాంస్య ప‌త‌కాలు కైవసం చేసుకుంది.

2022లో కీలక మలుపు

2022లో సోనీపత్ లోని భారత క్రీడాప్రాధికార సంస్థ ఆర్చరీ అకాడమీలో చోటు లభించడం చికిత కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ప్రతిభావంతురాలైన చికితను అక్కడి కోచ్ లు మరింత ప్రతిభావంతురాలుగా తీర్చిదిద్దారు. ఆమెలో దాగి ఉన్న అత్యుత్తమ ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చారు. ఫలితమే 2023 గోవా జాతీయ క్రీడల్లో చికితకు స్వర్ణ పథకం దక్కింది. అదే ఏడాది జాతీయ సీనియర్ ఆర్చరీలో రెండు రజతాలు, జాతీయ జూనియర్ టోర్నీలో రెండు కాంస్యాలతో ఆమె సత్తా చాటింది.

ఈ ఏడాది ప్రపంచకప్ లోనూ అత్యంత ప్రతిభ కనబరిచింది.. చైనా దేశం లోని షాంఘైలో జరిగిన టోర్నీలో టీమ్ విభాగంలో రజత పతకం దక్కించుకుంది. ఆసియా గ్రాండ్ ప్రిలో టీమ్ విభాగంలో కాంస్యం సాధించిన చికిత వ్యక్తిగత కేటగిరీలో నాలుగో స్థానంలో నిలిచింది. తాజాగా కెనడాలో జరిగిన యూత్ ప్రపంచ చాంపియన్షిప్ లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. అగ్రశ్రేణి క్రీడాకారిణుల్ని మట్టి కరిపించి చికిత పసిడి పథకం సొంతం చేసుకుంది.

Leave a Reply