Chennur | మున్సిపల్ పోరుకు వేగిరంగా ఏర్పాట్లు

Chennur | మున్సిపల్ పోరుకు వేగిరంగా ఏర్పాట్లు
- రేపు ఓటర్ల తుది జాబితా ప్రకటించే అవకాశం
- సిద్ధం అవుతున్న పార్టీలు
Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోరుకు సంబందించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఓటరు ముసాయిదా జాబితాలోని అభ్యంతరాలను పరిష్కరించే ప్రక్రియ ఈ రోజుతో పూర్తి చేసి సోమవారం ఓటర్ల తుదిజాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా 3,4 వార్డులను కలిపి క్లస్టర్‌గా పిలిచే ఏర్పాటు చేశారు. ఆర్ఓ, ఏఆర్ఓల నియామక ప్రక్రియ చేపడుతున్నారు. ఓటర్ల అభ్యంతరాలపై గత ఐదు రోజులుగా అభ్యంతరాలను స్వికరించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు సైతం తుదిదశకు చేరుకుంది.
చెన్నూరులో : చెన్నూర్ మున్సిపాల్టీలో 18 వార్డులు ఉండగా 19,903 ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకై
35 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
రిజర్వేషన్ల పరిస్థితి :
2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయని అధికారులు అంటున్నారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు ఒకే రిజర్వేషన్ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ కొనసాగుతుందా? మార్పులు జరుగుతాయా అనేది తేలాల్సి ఉంది. ఓటర్ల తుది జాబితా తర్వాతనే రిజర్వేషన్ల పై ఒక స్పష్టత రానుంది.
సిద్ధమవుతున్న పార్టీలు :
మున్సిపల్ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. పార్టీల గుర్తులపై నిర్వహించనున్న ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు గురిపెట్టాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎవరి తరహాలో వారు పోరుకు సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్ల అనుకూలతను పట్టి జంపు జిలానీలు సైతం పార్టీలు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కొందరయితే రహస్య సమావేశాలు నిర్వహిస్తూ తమను ఆశీర్వదించాలని వేడుకుంటున్నారు. మరి కొందరు రిజర్వేషన్ల స్పష్టతపై ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా చెన్నూరు మున్సిపాల్టీ అధికారాన్ని చే జిక్కించుకోవాలని ప్రధాన పార్టీలు తహతహ లాడుతుంటే పార్టీలు మారె నాయకులు రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరాన్ని ముందస్తుగా సంకేతాలు పంపుతూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏది ఏమైనప్పటికి మరి కొద్దీ రోజుల్లో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలు రసకం దాయంలో జరుగుతాయనే అభిప్రాయాలు ప్రజలనుంచి విలువడుతున్నాయి.
