సింహాసనం కోసం సవాల్..

సింహాసనం కోసం సవాల్..

  • -స్టేషన్ ఘన్‌పూర్‌లో హోరాహోరీ పోరు
  • -చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ దృష్టి
  • -ఎక్కువ వార్డుల కోసం బీఆర్‌ఎస్ వ్యూహాలు
  • -స్వతంత్రుల ప్రభావం ఎంత?
  • -ప్రైవేట్ సర్వేలపై రాజకీయ చర్చ

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలో రాజకీయ ఉత్కంఠ రోజురోజుకు పెరుగుతోంది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కసరత్తు చేసింది. ముందుగానే చైర్మన్ పదవి పై కన్నేసిన కాంగ్రెస్ నేతలు గెలిచే వార్డుల పై దృష్టి సారించి వ్యూహాలు రచించారు. మరో వైపు బీఆర్‌ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకో వడమే లక్ష్యంగా బలమైన ప్రచారం నిర్వహించింది. ప్రతి వార్డులో మెజార్టీ సాధించాలని పట్టుదలగా కృషి చేస్తూ గెలుపు అవకాశాల పై లెక్కలు వేసుకుంది. ఈ పోటీలో స్వతంత్ర అభ్యర్థుల పాత్ర కూడా కీలకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని వార్డుల్లో స్వతం త్రులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఫలితాలు తారుమారు అయితే.. చైర్మన్ ఎన్నికలో వారి మద్దతు నిర్ణయకమయ్యే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

-ప్రైవేట్ వ్యక్తులతో సర్వేలు:
మున్సిపాలిటీ పరిధిలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించిన సర్వేలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఎవరికెన్ని స్థానాలు వస్తాయన్నదాని పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సైలెంట్ ఓటింగ్ కారణంగా స్పష్టమైన అంచనాలు వేయడం కష్టమైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బుధవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనుండటంతో ఫలితాల పై ఉత్కంఠ మరింత పెరిగింది. మొత్తంగా స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ ఫలితాలు రాజకీయంగా కీలకంగా మారాయి. చైర్మన్ పీఠం ఎవరిని వరించబోతుందో, స్వతంత్రుల నిర్ణయం ఏ దిశగా ఉంటుందో అన్నది 13న తేలనుంది.

Leave a Reply