Toll Pass | ఏడాదికి మూడు వేలు.. టోల్ పాస్ ఇవ్వనున్న కేంద్రం !
దేశంలోని జాతీయ రహదారుల టోల్ ప్లాజాల నుంచి రెగ్యులర్‌గా ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించనుంది. టోల్ గేట్ నుంచి నిత్యం ప్రయాణించే వారికి.. బస్సులు, రైళ్లలో అందించే విధంగా వార్షిక, జీవితకాల పాస్‌లను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటుంది.
వార్షిక పాస్‌కు రూ.3000, కారు జీవితకాలం 15 సంవత్సరాలు కాగా.. లైఫ్ టైం పాస్ కు రూ.30,000 పీజును చెల్లించాల్సి ఉంటుందని వివరించింది. ఈ ప్రతిపాదనలపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతుంది.
దీంతో జాతీయ రహదారులను నిత్యం వినియోగించే ప్రైవేట్ కార్ల యజమానులకు ఆసరాగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రతి కారులో ఫాస్ట్‌ట్యాగ్‌లు తప్పనిసరి చేయగా.. కొత్త పాస్‌లు ఇవ్వాల్సిన అవసరం లేకుండా వీటిపై పాస్‌లు జారీ చేసే అవకాశం ఉంది.
వీలైనంత త్వరగా ఈ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలు తుది దశలో ఉన్నాయని, వీటిని ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై కేంద్రం ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.