Festival of Colors | రంగుల హ‌రివిల్లు … ఇంటింటా హోలీ సందడి

ఆడిపాడిన యువ‌తీ, యువ‌కులు
అంబ‌రాన్నంటిన వేడుక‌లు
హైద‌రాబాద్‌లో ఘ‌నంగా సంబురాలు
రంగుల్లో మునిగి తేలిన‌ యువ‌త‌
సంబురాల్లో పాలుపంచుకున్న కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌
డ‌ప్పుకొట్టి ద‌రువేసిన జ‌గ్గారెడ్డి
మాస్ స్టెప్స్‌తో ఆక‌ట్టుకున్న మ‌ల్లారెడ్డి

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : హోలీ సంబురాలు ఆంబ‌రాన్నింటి తాకాయి. శుక్ర‌వారం ఉద‌యం నుంచి దేశ‌విదేశాల‌తోపాటు తెలంగాణ‌లో యువ‌తి, యువ‌కులు రంగుల్లో మునిగి తేలారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ఉత్సాహంగా పండుగ జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ.. దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. విదేశాల్లో ఉండే భారతీయులు కూడా హోలీ పండుగను జరుపుకున్నారు. హైద‌రాబాద్‌తోపాటు ముంబ‌యి, కోల్‌క‌త్తా, చెన్నై, న్యూఢిల్లీ, ల‌క్నో, వార‌ణాసి త‌దిత‌ర ప్రాంతాల్లో హోలీ సంబురాలు ఘ‌నంగా జ‌రిగాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా హోలీ వేడుకలను యువ‌కులు ఉత్స‌హంగా నిర్వహించారు. సప్తవర్ణాల్లో కుర్రకారు హుషారుగా పాటలు పాడుతూ డ్యాన్స్ చేశారు. ఒకరికి ఒకరు ముఖానికి సహజ సిద్ధమైన రంగులు అద్దుకుని కేరింతలు కొట్టారు. చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ హోలీ వేడుకల్లో మునిగి తేలారు. గల్లీ గల్లీలో హోలీ సంబురాలు అంబరాన్ని అంటాయి. పలు చోట్ల హోలీ ఈవెంట్స్ సైతం ఏర్పాటు చేశారు. డీజే సాంగ్స్ , రెయిన్ డ్యాన్స్ తో కుర్రకారు ఉర్రూతలు ఊగారు.

హైద‌రాబాద్‌లో ఆంక్ష‌ల మ‌ధ్య హోలీ

ఒక వైపు రంజాన్ మాస శుక్ర‌వారం.. మ‌రో వైపు ఇదే రోజు హోలీ కావ‌డంతో పోలీసులు ఆంక్ష‌లు విధించారు. ప్ర‌ధానంగా చార్మిన‌ర్, ఉత్త‌ర భార‌త‌దేశం నివాసులు అధికంగా ఉన్న బేగం బ‌జార్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఆంక్ష‌లు క‌ఠిన‌త‌రం చేశారు. భారీ పోలీసు బందోబ‌స్టు ఏర్పాటు చేశారు. అయినా ఆంక్ష‌ల న‌డుమ హోలీ సంబురాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ప్ర‌తి గ‌ల్లీలోనూ చిన్నారులు, యువ‌త‌, పెద్ద‌లు సైతం హోళీ సంబురాల్లో పాల్గొని రంగులు పూసుకున్నారు. చార్మిన‌ర్‌, కోఠి, బేగంబ‌జార్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఉద‌యం నుంచి చిన్న‌పిల్ల‌లు, యువ‌త రోడ్ల‌పైకి ఉత్స‌హంగా రంగులు చ‌ల్లుకున్నారు. అలాగే అమీర్‌పేట‌, ఎర్ర‌గ‌డ్డ‌, బాలాన‌గ‌ర్‌, కూక‌ట్‌ప‌ల్లి, కేపీహెచ్‌బీ, ప‌టాన్‌చెరు, గ‌చ్చిబౌళి, కొండాపూర్‌, మాదాపూర్ త‌దిత‌ర ప్రాంతాల్లో హోళీ సంబురాలు అంబ‌రాన్ని తాకాయి.

కేంద్ర మంత్రి సంజయ్ కేరింత‌లు

కరీంనగర్‌ బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట హోలీ సంబురాల్లో కేంద్ర మంత్రి బండి సంజ‌య్ పాల్గొన్నారు. ముఖ్య కార్యకర్తలు, కార్యకర్తలు అభిమానులతో కలిసి రంగుల్లో మునిగి తేలారు. యువ‌త కేరింత‌ల‌తో ఆయన గొంతు క‌లిపారు. ఆయ‌న‌తోపాటు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఫుల్ జోష్‌గా రంగుల్లో మునిగి తేలారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దేశ వ్యాప్తంగా హోలీ పండుగను వైభవోపేతంగా జరుపుకుంటున్నారన్నారు. ఎల్లప్పుడు హిందూ సమాజం ఒకే తాటిపై ఉండాలని ఆకాంక్షించారు.

డ‌ప్పు కొట్టి డ్యాన్స్ చేసిన జ‌గ్గారెడ్డి

హోలీ సంద‌ర్భంగా అంద‌రి క‌ళ్లు జ‌గ్గారెడ్డిపై ప‌డుతుంది. సంగారెడ్డిలో హోలీ సంబురాల్లో జ‌గ్గారెడ్డి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సంగారెడ్డి ప‌ట్ట‌ణంలో రామ్ నగర్ కాలనీలో తన చిన్న నాటి మిత్రులతో కలిసి కాముని దహన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చిన్నప్పటి దోస్తులతో కాసేపు ముచ్చిటించిన తర్వాత కాముని దహనం ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డప్పు కొడుతూ.. డ్యాన్స్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్లందరిని ఉత్సాహపరిచాడు.

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో హోలీ సంబరాలు

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పోలీసు గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హోలీ కార్యక్రమాలలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పాల్గొని అధికారులకు సిబ్బందికి రంగులు పూసి, హోలీ పండుగ శుభాాంక్షలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రంగుల హోలీని ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని సూచించారు.

మ‌ల్లారెడ్డి మాస్ డ్యాన్స్‌…

హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్‌ రెడ్డి బోయిన్‌పల్లిలోని వారి నివాసంలో వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలతో కలిసి రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా తన సతీమణికి మ‌ల్లారెడ్డి రంగులు పూశారు. అలాగే, తన మనుమరాళ్లను ఎత్తుకుని మాస్ డ్యాన్స్‌ చేశారు. డప్పు కొడుతూ అక్కడ ఉన్న వారందరిలో జోష్‌ నింపారు. ఇక, తనదైన శైలిలో స్టేప్పులు వేస్తూ ఉత్సాహంగా కనిపించారు.

హోలీ వేడుకలో న్యూజిలాండ్ ప్రధాని సంద‌డి
హోలీ వేడుక‌ల్లో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్‌ లుక్సాన్ పాలుపంచుకున్నారు. ఉత్సాహంగా 3, 2, 1 అంటూ ప్రజలపై రంగులు చల్లారు. న్యూజిలాండ్ ప్ర‌ధాని సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *