కావేరీ బస్సు కథ మలుపు తిప్పిన సీసీ పుటేజీ
కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వి.కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర అగ్నిప్రమాదంలో.. కొత్త ట్విస్ట్ .. సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ తెరమీదకు వచ్చింది. ఈ ఘటనలో 20 మంది నిద్రావస్థలోనే సజీవ దహనమయ్యారు. కవాబ్ ముద్దలుగా మారారు. తాజాగా ఓ సీసీటీవీ ఫుటేజీ కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన బైకర్ .. పూటుగా మందు కొట్టి బైకుతో చేసిన విన్యాసం తెరమీదకు వచ్చింది.
ప్రమాదానికి అరగంట ముందు కర్నూలు టీవీ9 కాలనీ, ప్రజానగర్ కు చెందిన బైకర్ బుచ్చాలు శివశంకర్ పెట్రోల్ బంక్‌లో కనిపించాడు. అక్కడ అతడి మితిమీరిన ప్రవర్తన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో శివశంకర్ అర్ధరాత్రి 2.20 గంటల సమయంలో బైక్‌పై అక్కడికి చేరుకున్నాడు.
మద్యం మత్తులో ఊగిపోతున్నాడు. బంకు సిబ్బందిని కేకలు వేస్తూ పిలవడం కనిపించింది. స్తంభాల మధ్య తిప్పుతూ, పెట్రోల్ బంకు సిబ్బంది రారని నిర్ధారించుకున్న తర్వాత.. కోపంతో తన బైక్ ను అతిగా తిప్పాడు. ఆ తర్వాత బైక్ నడుపుతూ కిందకి పడుతూ కంట్రోల్ చేసుకున్నట్లుగా ఈ పుటేజీలో కనిపిస్తోంది. ఆ సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అతడితో పాటు మరో యువకుడు ఇదే బైక్ పై పెట్రోలు బంకులో దిగాడు. ఇతడిని వదిలి నెమ్మదిగా జారుకున్నాడు. ఈ ప్రమాదం జరిగే ముందు కేవలం కొన్ని నిమిషాల వ్యవధి వీడియోలోని టైమ్ స్టాంప్ ప్రకారం, పెట్రోల్ బంక్ నుంచి బయటకు వచ్చిన కొన్ని నిమిషాలకే బస్సు ప్రమాదం జరిగింది. బైకర్ మత్తులో ఉండటం వల్ల కంట్రోల్ కోల్పోయి బస్సు కింద ఇరుక్కుపోయాడా? లేదా బస్సు వేగం అధికంగా ఉండటమే కారణమా? అన్న అంశాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.
దర్యాప్తు చకచక…
కర్నూలు పోలీసులు ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీలను సేకరించగా, ఫోరెన్సిక్, ట్రాఫిక్ విశ్లేషణ బృందాలు బస్సు వేగం, ఢీకొట్టిన కోణం, మంటలు చెలరేగిన సమయాన్ని సాంకేతికంగా విశ్లేషిస్తున్నాయి. అదే సమయంలో బస్సు ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం, వాహన స్థితి, డ్రైవర్ వైఖరి వంటి అంశాలపై కూడా సమాంతర విచారణ కొనసాగుతోంది.
ప్రధానంగా దర్యాప్తులో రెంఉ కోణాలు కనిపిస్తున్నాయి. ఒకటి బైకర్ నిర్లక్ష్యం, మద్యం మత్తులో బైక్‌పై కంట్రోల్ కోల్పోవడం. మత్తులో బస్సును ఢీకొట్టటం. ఫలితంగా బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడం. రెండు బస్సు వేగం నియంత్రణ కోల్పోవటం. ఢీ కొట్టిన బైక్‌ను ఈడ్చుకు పోవటంతో మంటలు వ్యాపించటం, ఈ కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బైక్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనిపిస్తోంది. పూర్తి స్పష్టత ఫోరెన్సిక్, టెక్నికల్ రిపోర్టుల తరువాతే తెలుస్తుంది,” అని దర్యాప్తు అధికారి వెంకట్రామయ్య తెలిపారు.
బైకర్ మనో స్థతిలో కొత్త కోణం..
బైకర్ శివ శంకర్ మద్మం మత్తు ఇక్కడ ఈ ఘోరానికి అసలు కారణంగా కనిపిస్తోంది. ఈ మత్తులో తనతోపాటు 20 మంది సజీవ దహనానికి కారణమయ్యాడు. ఫలితంగా… బస్సు నడిపిన డ్రైవరుకు ఈ కేసులో కాస్త ఊరట లభించవచ్చు. ఎందుకంటే.. ప్రమాదం జరిగిన సమయంలో భారీ వర్షం పడుతోంది. ఈ వానలో ఎదుటి వాహనం స్పష్టంగా కనిపించలేదు. పైగా.. వేరే వాహనం ఢీకొట్టి వెళ్లిపోగా.. అతడు రోడ్డు పక్కన పడిపోయాడు, బైకు రోడ్డుకు అడ్డంగా పడింది. ఈ బైక్ పై బస్సు దూసుకు పోవటంతో ప్రమాదం జరిగిందని డిఫెన్స్ వాదించవచ్చు. ఒకవేళ బస్సు ఢీకొనటానికి డ్రైవరే కారణమైతే.. హిట్ అండ్ రన్ కోసం ప్రయత్నించవచ్చు. ఈలోపే బస్సు అగ్ని గోళంగా మారింది.. 20 మంది ఆహుతయ్యారు. ఇక విషయాన్ని పక్కన పెడితే.. శివశంకర్ మానసిక స్థితిని పరిశీలిస్తే.. అతడిలో మద్యం మత్తులో సైకో కనిపిస్తున్నాడు. ఎక్కడ తగ్గేదిలే.. అనే తత్వం వ్యక్తం అవుతోంది.

అతడు నిరుపేద. రోజువారీ కూలీ. విలాసాలపై మక్కువ ఎక్కువ. కానీ ఈ సమాజంలో అతడికి అన్నీ అడ్డంకులే. ఈ స్థితిలోనే అడ్డదిడ్డంగా వ్యవహరించాడు. టీవీ 9 కాలనీ వాసులు అతడి పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థితిలో అతడే కావాలని బస్పు కింద పడే ప్రయత్నం చేశాడా? అనే కోణమూ జనాన్ని ప్రశ్నిస్తోంది. అతడితోపాటు గుత్తి పట్టణానికి బయలు దేరిన యువకుడు ఎవరు? శుక్రవారం రాత్రి ఏమి జరిగింది? ప్రభాస్ సినీ ఫంక్షన్ తరువాత శివశంకర్ లో మార్పు ఏంటీ? ఏదన్నా ప్రేమ విఫల కథ ఉందా? ఎందుకంటే.. త్వరలో అతడికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్న తరుణంలో.. శివశంకర్ మరణం ప్రమాదమో? యాదృశ్చికమో? స్వయం కృతమో.. గానీ.. 20 మంది ఆహుతికి కారణమయ్యాడు.

