- సింధు నది ఒప్పందం రద్దు..
- వాఘా-అత్తారీ సరిహద్దు మూసివేత
- పాకిస్తానీల వీసా రద్దు
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, భారతదేశం పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో దాదాపు మూడుదాదాపు మూడు గంటలపాటు జరిగిన (Cabinet Committee on Security) భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేవంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
1960లో పాకిస్తాన్‌తో చేసుకున్న “సింధూ జలాల ఒప్పందాన్ని” రద్దు చేస్తున్నట్లు భారతదేశం ప్రకటించింది. అలాగే, అట్టారి-వాఘా సరిహద్దును మూసివేయాలని భారత్ నిర్ణయించింది.
అంతేకాకుండా, పాకిస్తాన్ పౌరులను భారతదేశంలోకి అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జారీ చేసిన వీసాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లో దేశాన్ని వీడాలని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాకిస్థాన్ హైకమీషన్ ను కూడా భారత్ నుండి వెళ్లగొట్టాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. వారు భారత్ నుంచి వెళ్లిపోవడానకి వారం రోజుల గడువు ఇచ్చారు. అలాగే, ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని సిబ్బంది సంఖ్యను 55 నుండి 33కి తగ్గించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.
అదేవిదంగా ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ నుండి భారతదేశం సొంత రక్షణ/నేవీ/వైమానిక సలహాదారులను ఉపసంహరించుకుంది.
ఈ నిర్ణయాలన్నీ పహల్‌గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా తీసుకున్నవేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలతో ఎలాంటి చర్చలు జరపబోమని భారత్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోకపోతే, భవిష్యత్తులో మరిన్ని కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.