ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఖాయిలా పడిన సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) (CCI) పరిశ్రమ పునఃప్రారంభించడానికి రూ.2వేల కోట్లు అవసరం ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు సీసీఐ సీఎండీ సంజయ్ బంగా తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ లోని తెలంగాణ సచివాలయంలో ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ (Cement industry) పునఃప్రారంభం అంశంపై సీసీఐ సీఎండీ సంజయ్ బంగా, చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. ఈ పరిశ్రమను పునరుద్ధరించి కార్మికులకు ఉపాధి చూపాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), తానూ పలు సందర్బాల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామిని కలిసి కోరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్లాంట్ తెరిస్తే.. మూడు వేల మందికి ఉపాధి…
నేటి పరిస్థితుల్లో ప్లాంటును ఆధునిక యంత్రాలతో పునరుద్ధరించడానికి రూ. 2 వేల కోట్లు అవసరమని సిఎండి సంజయ్ భంగా (CMD Sanjay Bhanga) తెలిపారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమయ్యే ముడిసరుకు అందుబాటులో ఉందని, ప్లాంటు తెరిస్తే మూడు వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి శ్రీధర్ బాబుకు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు (Sridhar Babu) మాట్లాడుతూ.. ఈ భారీ పరిశ్రమను తెరిపించడానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు సందర్బాల్లో కేంద్రాన్ని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం ప్రతిపాదిస్తున్నట్టుగా ప్లాంటు ప్రైవేటీకరణను (డిస్ ఇన్వెస్ట్ మెంట్) ను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పునురుద్ధరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సీసీఐ కోరుతోందని, త్వరలోనే తమ అభిప్రాయాలతో లేఖ అందజేస్తామని మంత్రి వెల్లడించారు.
రెండు వేల ఎకరాల్లో…
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో రెండు వేల ఎకరాల్లో నాణ్యతతో కూడిన సున్నపురాయి గనులు ఉన్నందున ప్లాంటు పునరుద్ధరణ కేంద్రం తలుచుకుంటే కష్టమేమీ కాదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణ (CCI Renewal) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఈ సమావేశంలో మైన్స్ అండ్ జియాలజీ ముఖ్యకార్యదర్శి ఎన్. శ్రీధర్, గనుల శాఖ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, టిజిఐఐజి ఎండీ శశాంక, తాండూరు సీసీఐ ప్లాంట్ జిఎం శరద్ కుమార్, సీసీఐ రీజినల్ మేనేజర్ ఉమేశ్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి కూడా సమావేశానికి హాజరై తమ సూచనలను వివరించారు.
