పామర్రు మాజీ ఎమ్మెల్యేపై కేసు..

పామర్రు మాజీ ఎమ్మెల్యేపై కేసు..

పోలీస్ విధులకు భంగం కలిగిస్తే సహించం

  • ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

కృష్ణా ప్రతినిధి – (ఆంధ్రప్రభ) : మొంథా తుఫాన్ బాధిత రైతులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 4వ తేదీన‌ చేపట్టిన రైతు పరామర్శ యాత్రలో భాగంగా పామర్రు నియోజకవర్గం గోపువానిపాలెం అడ్డరోడ్డు వద్ద హైవే పై విధులు నిర్వహిస్తున్న కృష్ణాజిల్లా పోలీస్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి, దుర్భాషలాడి, విధులకు ఆటంకం కలగించినందుకు గాను మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై కేసు నమోదు చేసామని ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలను కాపాడడానికి విధులు నిర్వహిస్తున్న పోలీసులు కించపరిచేలా ప్రవర్తిస్తూ, వారి విధులను ఆటంకం కలిగించే విధంగా పమిడిముక్కల సీఐ సి.హెచ్ చిట్టిబాబుతో వాగ్వాదానికి దిగడంతో పాటు పోలీసులను దుర్భాషలాడుతూ దురుసుగా వ్యవహరించిన పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ చేసిన చర్యను కృష్ణా జిల్లా పోలీసులు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన లేదా మరే విధమైన కార్యక్రమైనా ఎటువంటి ఆంక్షలు, నియంత్రణలు లేకుండా జరగడం సాధ్యం కాదన్నారు. ఆంక్షలు లేకపోతే, సదరు కార్యక్రమంలో ఉన్న వారి ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగే అవకాశం లేక పోలేదని, అయితే.. విధి నిర్వహణలో ఉండే పోలీసు శాఖ ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించే ముందు విజ్ఞతతో వ్యవహ‌రించాలని కోరారు.

Leave a Reply