పిఏసిఎస్, ఐకేపీ దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి…

పిఏసిఎస్, ఐకేపీ దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి…
మోత్కూర్, ఆంధ్రప్రభ : రైతులు పండించిన వరి ధన్యాన్ని కల్లాలలో అరపోసి, దాన్యం కొనుగోలు కోసం గత 15 రోజులుగా రైతులు నిరీక్షిస్తున్నారని, మండలంలోని పిఏసిఎస్, ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్వహించే దాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మోత్కూర్ మండలంలోని పాలడుగు గ్రామంలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పార్టీ నాయకులతో కలసి పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు అరుగాలం కష్టపడి పండించిన వరిపంట కోతలు ప్రారంభమై దాన్యాన్ని కల్లాలలో పోసి రైతులు కొనుగోలు కోసం ఎదురుచుస్తున్నారని, మండలంలోని పిఏసిఎస్, ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్వహించే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో కాలయాపన చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారన్నారు. మండలంలో దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ప్రైవేటు కాంటాల వద్ద వ్యాపారులు రైతులను నిలువునా దోపిడీచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ 2389 లు కాగా, ప్రైవేటు వ్యాపారులు రూ. 1500 నుండి 1600 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, అదనంగా హమాలీ చార్జీలు రూ. 100 కట్ చేస్తే రైతుకు కేవలం 1400 నుండి 1500 వరకు మాత్రమే వస్తుందని తద్వారా రైతులు నష్టపోతున్నారన్నారు. రైతులు దోపిడీకి గురికాకుండా ప్రభుత్వం వెంటనే గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి మద్దతు ధరకు దాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, శాఖ కార్యదర్శి పిట్టల చంద్రయ్య, సైదులు, రైతులు ముక్కాముల మచ్చగిరి, బద్దం లక్ష్మా రెడ్డి, ముక్కాముల శ్రీశైలం, ముక్కాముల రేణుక తదితరులు పాల్గొన్నారు.
