Cyclothon | సందడిగా సైక్లోథాన్ సైకిల్ ర్యాలీ..

Cyclothon | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు ‘బ్రో.. సైకిల్ తొక్కు బ్రో’ నినాదంతో గుడివాడ సైక్లోథాన్ 2025 సైకిల్ ర్యాలీ ఆదివారం ఉదయం గుడివాడలో సందడి వాతావరణంలో జరిగింది. ర్యాలీలో వేలాదిగా పాల్గొని కదం తొక్కిన విద్యార్థులు, యువతతో కలిసి ఈగల్ టీం ఐజీ ఆర్కే రవికృష్ణ, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సుఖద దంపతులు, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పలు అధికార ప్రముఖులు సైకిల్ తొక్కుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత జరిగిన సభలో విద్యార్థులను ఉద్దేశించి ఈగల్ టీం ఐజి రవి కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామన్నారు.

తాము పట్టుకున్న అనేక కేసుల్లో చెడి స్నేహాలతో డ్రగ్స్ బారిన పడి ఎందరో అమాయకులు తమ జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు. మంచి అలవాట్లకు, చెడు అలవాట్లకు మధ్య వ్యత్యాసాన్ని చిన్నతనం నుండి గుర్తించాలన్నారు. మంచి అలవాట్లతో మనం ఉన్నత స్థాయికి చేరుకోవచ్చనీ చెడు అలవాట్లతో పతనమైపోతామని, అమ్మానాన్నల కలలను నిజం చేసేలా ప్రతి ఒక్కరూ మంచివైపు నడవాలని ఐజి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతున్నారన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అనేది మనందరి నినాదం కావాలన్నారు.

రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మాలంటే భయపడే రోజులు వచ్చాయని, డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరం భాగస్వామ్యం అవుదామన్నారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే ప్రభుత్వ టోల్ ఫ్రీ 1972 నంబర్ కు సమాచారం అందించాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ ఓ మంచి కార్యక్రమానికి ఇన్ని వేలమంది చిన్నారులు రావడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపడంలో తాము చేస్తున్న కృషికి నేడు చిన్నారులు ఇస్తున్న ప్రోత్సాహం చూస్తుంటే తాము మరింత ఉత్సాహంగా పనిచేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.

ముందుగా ఫ్రీ సొసైటీ సై నో టూ డ్రగ్స్ ప్రచార ఫ్ల కార్డులను ఐజి రవి కృష్ణ, ఎమ్మెల్యే రాము ఇతర ప్రముఖులు ఆవిష్కరించగా ఎమ్మెల్యే రాము దంపతులు పావురాలు వదిలి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఐజి రవి కృష్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేయగా, ఎమ్మెల్యే రాము స్టేడియం పతాకాన్ని ఎగురవేశారు. స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు జెండా ఊపి సైకిల్ ర్యాలీలను ప్రారంభించారు. పెద్ద ఎత్తున ర్యాలీ సీనియర్ జూనియర్ విభాగాల్లో ర్యాలీ జరుగుతున్న దృష్ట్యా గుడివాడ పట్టడంతో పాటుగా ర్యాలీ జరిగే రూట్లలో ట్రాఫిక్ మళ్ళిస్తూ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులకు స్టేడియం కమిటీ తరఫున సర్టిఫికెట్స్, బహుమతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాస్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగ ప్రసాద్, ఈగల్ టీం ఐపీఎస్ మహేశ్వర రాజు, మచిలీపట్నం డిఎస్పీ రాజా, ఐఎంఏ పెద్దలు డాక్టర్ పొట్లూరి వంశీ, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్రావు, లింగం ప్రసాద్, టీం వెనిగండ్ల సభ్యులు, పలు స్వచ్ఛంద, సామాజిక సంస్థల పెద్దలు, ఐఎంఏ వైద్యులు, సైకిల్ క్లబ్ సభ్యులు, వేలాదిగా విద్యార్థుల విద్యార్థులు యువతరం పాల్గొన్నారు.

Leave a Reply