Bull Run | షేర్ మార్కెట్ లో లాభాలే లాభాలు..

ముంబ‌యి – దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇన్వెస్టర్లకు కన్నుల పండుగ చేశాయి. వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌లోనూ లాభాల పంట పండించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, మన మార్కెట్లు మాత్రం తిరుగులేని జోరుతో దూసుకుపోతున్నాయి. వరుస దూకుడుతో సూచీలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి.

ఉదయం సెన్సెక్స్ 78,903.09 పాయింట్ల వద్ద లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రోజంతా కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీ వెనక్కి తిరిగి చూడలేదు. ఒక దశలో 79,635.05 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకి, చివరకు భారీగా 855 పాయింట్ల లాభంతో 79,408.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా అదే బాటలో పయనించి 273.90 పాయింట్ల లాభంతో 24,125.55 వద్ద ముగిసింది. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ కాస్త బలపడి 85.13 వద్ద ఉంది.

అమెరికా విధించే టారిఫ్‌ల గురించిన ఆందోళనలు క్రమంగా తగ్గుముఖం పట్టడం మార్కెట్‌కు ఊపిరినిచ్చింది. అంతేకాదు, పలు కంపెనీలు ప్రకటించిన అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ఇక విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ మన మార్కెట్లపై దృష్టి సారించి పెట్టుబడులు పెట్టడం సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది. ఈ సానుకూల పవనాలతో సెన్సెక్స్ మళ్లీ తన మాయాజాలాన్ని చూపుతూ ఏకంగా 79 వేల మార్కును దాటేసింది! నిఫ్టీ సైతం 24 వేల పైన స్థిరంగా కొనసాగుతోంది.

ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజ బ్యాంకుల మంచి ఫలితాలు ఈ రంగానికి మరింత ఊపునిచ్చాయి. దీంతో బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 55 వేల మార్కును దాటి, 55,304 వద్ద సరికొత్త ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఇది బ్యాంకింగ్ రంగంలోని ఇన్వెస్టర్లకు నిజంగా పండగే!

Leave a Reply