బుగ్గ రాజేశ్వరుడి జాతర ఆదాయం రూ. 12.63 లక్షలు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బెల్లంపల్లి కన్నాల శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన ఆదాయ వివరాలను కార్యనిర్వహణాధికారి ముక్త రవి వెల్లడించారు. శుక్రవారం హుండీ లెక్కింపు జరుగ్గా ఆయన వివరాలు తెలిపారు. ఈ ఏడాది జాతర ఆదాయం గత ఏడాది కంటే గణనీయంగా పెరిగి మొత్తం రూ. 12,63,278 కు చేరింది. గత ఏడాది వచ్చిన రూ. 11,39,369 ఆదాయంతో పోలిస్తే, ఈసారి రూ. 1,23,909 అదనంగా సమకూరిందని తెలిపారు.
దేవాలయానికి వివిధ సేవల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను పరిశీలిస్తే.. హుండీ ద్వారా రూ. 4,83,058, దర్శనం టికెట్ల ద్వారా రూ. 3,79,300, బహిరంగ వేలం ద్వారా రూ. 3,45,000, అభిషేకం ద్వారా రూ. 34,900, కళ్యాణకట్ట ద్వారా రూ. 21,020 ఆదాయం లభించింది. శ్రీ కోదండ రామాలయం ఈవో ముక్త రవి పర్యవేక్షణలో, తాళ్ల గురజాల ఎస్సై రామకృష్ణ బందోబస్తు మధ్య ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు దూడం మహేష్, మంద ఉదయ్, వికాస్, మేష రమేష్, అరవింద్, దేవాలయ సిబ్బంది భాను, మహేష్‌లతో పాటు అర్చకులు శ్రీరామ్ బట్ల వేణుగోపాల శర్మ, కే. సతీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
