Budget Allocations – బీజేపీకి గులాంగిరీ రేవంత్ చేయ‌డంతోనే ఈ దుస్థితి – కెటిఆర్

హైద‌రాబాద్ – కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేకపోయిన సీఎం రేవంత్‌ రెడ్డి, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయ‌న మాట్లాడుతూ, జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణకు మోసమే చేస్తాయని మరోసారి రుజువయ్యిందన్నారు. బడే భాయ్‌.. చోటే భాయ్‌తో తెలంగాణకు నయాపైసా లాభం లేదని తేలిపోయిందన్నారు. రెండు పార్టీలు క‌ల‌సి తెలంగాణ‌ను ముంచేశారంటూ ఫైర్ అయ్యారు.. పార్లమెంట్‌లో ప్రాంతీయ పార్టీల బలమున్న బిహార్‌, ఏపీలకు ప్రాధాన్యమిచ్చి.. జాతీయ పార్టీలను ఆదరించిన తెలంగాణను నిండా ముంచారని ఇక్కడి ప్రజలకు మళ్లీ అర్థమైందన్నారు.

జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవని కేంద్ర బడ్జెట్ తో మరోసారి రుజువైందని అన్నారు. రెండు పార్టీల నుంచి ఎనిమిది మంది చొప్పున ఎంపీలను గెలిపిస్తే బడ్జెట్‌లో రాష్ట్రానికి దక్కింది గుండు సున్నా అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన సీఎం చీకట్లో బీజేపీ పెద్దలతో ఒప్పందాలు చేసుకోవడంతోనే రాష్ట్రానికి ఈ రోజు ఈ పరిస్థితి దాపురించిందన్నారు. రేవంత్‌ రెడ్డి 30 సార్లు ఢిల్లీకి పోయింది రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు కాదు బీజేపీకి గులాంగిరీ చేసేందుకు అని తేలిపోయిందన్నారు. ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునే పని తప్ప ఏనాడు తెలంగాణ కోసం గళం విప్పలేదన్నారు.

కొన్ని రాష్ట్రాల‌కే ఈ బ‌డ్జెట్ ….

దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌.. దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టడం బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్రం బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేద‌న్నారు. కేంద్ర ప్రభుత్వం పదే పదే వల్లెవేస్తున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా అని పునర్ సమీక్షించుకోవాలని కోరారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాద‌న్నారు. మొదటి నుంచి ఇదే దోరణిని ప్రదర్శిస్తూ రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం అంటూ నిర‌స‌న వ్య‌క్తం చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *