నిజమవుతున్న బీఆర్ఎస్ హెచ్చరికలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్(BRS) హెచ్చరికలు నిజమవుతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఈ రోజు తెలంగాణ భవన్‌లో మీడియాతో్ ఆయన మాట్లాడారు. తెలంగాణ పాలిట బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla project) పెను ప్రమాదంగా మారబోతోందని.. ఏపీ ప్రభుత్వం కేంద్రం సహకారంతో బనకచర్లపై ముందుకెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా పరోక్షంగా సహకరిస్తుందని మండిపడ్డారు.
బనకచర్ల ప్రాజెక్టును కొనసాగిస్తున్నామని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి లేఖ రాశారన్నారు. వరద జలాలపై ప్రాజెక్టు రిపోర్టులు ఆమోదించకూడదని, కానీ బనకచర్ల ప్రాజెక్టు పీఎఫ్ఆర్(PFR) పరిశీలిస్తున్నామని కేంద్రం లేఖ రాస్తే సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లకపోవడానికి ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
423 టీఎంసీ(TMC)లు ఏపీ మళ్లించుకుంటోందని కాబట్టి 112 టీఎంసీలు ఆల్మట్టిలో ఆపుకుంటామని కర్ణాటక(Karnataka) లేఖ రాసిందని, మరో వైపు వరద జలాలతో విదర్భలో ప్రాజెక్టులు కట్టుకుంటామని మహారాష్ట్ర సిద్ధమవుతోందని, ఇంత జరుగుతున్నా సీఎంగా ప్రజాప్రయోజనాలు కాపాడతావా లేక స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటావా అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. నల్లమల పిల్లి అని సెటైర్లు(Satires) వేశారు. మొన్న మల్లికార్జున ఖర్గేను పరామర్శించడానికి కర్ణాటకకు వెళ్లినప్పుడు, ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు గురించి సిద్ధరామయ్య, శివ కుమార్ దగ్గర మాట్లాడుతాడు అనుకున్నామని, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి మాట్లాడలేదన్నారు.