బీఆర్ఎస్ వాకౌట్ !

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరోసారి హాట్‌గా మారాయి. బీఆర్ఎస్ నేత‌లు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంత‌రం గన్‌పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు, అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు” అంటూ మండిపడ్డారు. పీసీ ఘోష్ కమిషన్ ఓ ట్రాష్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అందించలేదని ఆరోపిస్తున్నారు… నిరూపిస్తే రాజీనామా చేస్తా అంటూ హరీశ్ రావు సవాల్ విసిరారు.

అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టుపై హంగామా..

కాగా, అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ సందర్భంగా అధికార–ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం తీవ్రతరమైంది. హరీశ్ రావు మాట్లాడుతూ, “ఈ కమిషన్ నివేదిక చెత్త నివేదిక, ఇది కోర్టులో నిలబడదు” అని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు ప్రతివాదించారు.

ఇందులో భాగంగా బీఆర్ఎస్ సభ్యులు కమిషన్ రిపోర్ట్ కాపీలను చించి నిరసన తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం ముందు ఆందోళన చేశారు. అయితే, హరీశ్ రావు ప్రసంగం జరుగుతుండగా స్పీకర్ మైక్ కట్ చేయడంతో బీఆర్ఎస్ సభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి మాట్లాడే అవకాశం లేకపోవడంతో సభను వాకౌట్ చేసి గన్‌పార్క్ వద్ద ఆందోళన కొనసాగించారు.

Leave a Reply