Delhi | కేంద్ర మంత్రులకు బీఆర్ఎస్ బృందం విన్నపాలు
- కెటిఆర్ నాయకత్వంలో ఢిల్లీకి వెళ్లిన బృందం
- కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ లతో భేటి
- తెలంగాణలో ఎఐ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని వినతి
- తెలంగాణలో రోడ్లను మరింతగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ – తెలంగాణలో ప్రధానమైన పలు రోడ్లను మరింత విస్తృత పర్చేందుకు, అభివృద్ధి చేసేందుకు మరిన్ని నిధులు కేటాయించాల్సిందిగా కోరుతూ కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ లకు వినతిపత్రాలు అందజేసింది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కే.ఆర్.సురేష్ రెడ్డి, దామోదర్ రావు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, మాజీ ఎంపీ బీ.వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లతో ఉన్న బృందం ఇవాళ పార్లమెంట్ ఆవరణలోని కార్యాలయాల్లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ లతో విడి విడిగా భేటీ అయ్యారు.
మానవ వనరుల అభివృద్ధి శాఖ (విద్యా శాఖ) మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లు తెలంగాణకు ఐఐఏంను వెంటనే మంజూరు చేయాలని, పలు త్రిపుల్ ఐటీలు, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో నవోదయ పాఠశాలలను నెలకొల్పాలని కోరారు. అలాగే తెలంగాణలో రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజురు చేయాలని మరో కేంద్ర మంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.. బీఆర్ఎస్ నేతలు చెప్పిన అంశాలు, కోరిన పనుల పట్ల కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు.ఇక ఈసందర్భంగా కేంద్ర మంత్రులు గడ్కరీ, ధర్మేంద్రలకు పుష్పగుచ్చాలిచ్ఛి శాలువాలతో సత్కరించారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు బాల్క సుమన్, డాక్టర్ దాసోజు శ్రావణ్ కుమార్, ఆంజనేయలు గౌడ్, వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెండు రోజుల కేటీఆర్ అక్కడే …
ఇక ఈనెల 10వ తేదీన ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. దీనిపై న్యాయవాదులతో మాట్లాడేందుకు రెండు రోజుల పాటు కేటీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు..ఈ రెండు రోజుల కార్యక్రమంలో కేటీఆర్ బృందం పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి..