రాజకీయాల్లో ఆరోపణలు – ప్రత్యారోపణలు సహజం. ఎన్నికల సమయంలో ఇవి మరింత హీటెక్కుతాయి. అయితే, ఎన్నికల సమయంలోనే కాకుండా, ఇప్పుడు ఏది దొరికితే అది, ఏది పడితే అది అన్నట్టుగా అయింది రాజకీయ యుద్ధం.
తాజాగా, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎప్పట్నుంచో కాళేశ్వరంపై మాటల యుద్ధమే కాక న్యాయపరమైన వివాదమూ నడుస్తూనే ఉన్నా, ప్రస్తుత వర్షాల సమయంలో అది మరోసారి ఊపందుకుంది.
కాళేశ్వరం భద్రతపై అధికార కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ.. మేడిగడ్డ వద్ద ప్రవహిస్తున్న భారీ వరద నీటి దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు హల్ చల్ చేస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని, నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుండగా.. అదే ఆరోపణలను బీజేపీ కూడా గట్టిగానే పునరావృతం చేస్తోంది. కానీ, తాజాగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదల దెబ్బకు కూడా ప్రాజెక్టు చెక్కుచెదరకుండా నిలబడిందని సాక్ష్యాలతో సహా బీఆర్‌ఎస్ బహిర్గతం చేస్తూ కాంగ్రెస్–బీజేపీలపై కౌంటర్ దాడి ప్రారంభించింది.
బీఆర్ఎస్ కౌంటర్ !
కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందని, నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూనే ఉంది. ఈ ప్రాజెక్టు లోపాలపై అప్పటి సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ కీలక నేతలనే కాంగ్రెస్ నేరుగా బాధ్యులుగా చూపుతోంది.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపై 16 నెలల పాటు పీసీ.ఘోష్ కమిషన్ దర్యాప్తు జరిపి జూలై 31న నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ఇప్పటికే కేబినెట్ చర్చకు వచ్చినట్లు సమాచారం. నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించి, అన్ని నిర్ణయాలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అయితే, ఆ ఆరోపణలు అవాస్తవమని.. రైతులకు జీవనాడిగా ఉన్న కాలేశ్వరంపై కాంగ్రెస్ విషం చిమ్ముతుందంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు డిఫెండ్ చేస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్-బీజేపీ చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ప్రస్తుతం, రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్నీ జలాశయాలు, ప్రాజెక్టులు నిండుకులా మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్–బీజేపీలు కాళేశ్వరం కూలిందంటూ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ ఖండించింది. మేడిగడ్డ వద్ద 10 లక్షల క్యూసెక్కుల వరదనీటిని కూడా ప్రాజెక్టు తట్టుకుని నిలిచిందని, ప్రస్తుతానికి 4,51,920 క్యూసెక్కుల నీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రవహిస్తోందని ఫోటోలతో సహా బహిర్గతం చేసింది.

‘‘పొద్దున లేస్తే కాళేశ్వరం కూలింది.. కుంగింది అంటూ మొరుగుతున్న కాంగ్రెస్- బీజేపీ సన్నాసుల్లరా ఇప్పుడు మీ మొఖాలు ఎక్కడ పెట్టుకుంటారు. మొన్న మేడిగడ్డ బ్యారేజీ వద్ద 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చినా తట్టుకొని నిలబడ్డది.. చెక్కు చెదరలేదు. ఇవ్వాళ కూడా 4,51,920 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. ఇప్పటికైనా కండ్లు తెరిచి చూడండి. విషం చిమ్మడం ఆపండి. రైతుల ప్రయోజనాలపై రాజకీయాలు బంద్ పెట్టండి.. లేదంటే మీకు రాజకీయ సమాధి తప్పదు” అని బీఆర్‌ఎస్ హెచ్చరించింది.
హీటెక్కనున్న అసెంబ్లీ…
ఇదిలా ఉంటే, ఈ నెల 30వ తేదీ (శనివారం) నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రధాన అజెండాగా ఉండనుంది. మూడు నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ఇరుపక్షాల మధ్య ముదిరే చర్చలు సభను వేడెక్కించనున్నాయి.
కాంగ్రెస్ పార్టీ… బీఆర్ఎస్ అవినీతిని సభ సాక్షిగా బయటపెడతామని చెబుతుంటే, అదే సభలో అన్ని కుట్రలను తిప్పికొడతామని బీఆర్ఎస్ ధైర్యంగా ప్రకటిస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.