Brs l మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి..

Brs l మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి..
చౌటుప్పల్ మున్సిపాలిటీపై మరోసారి బీఆర్ఎస్ జండా ఎగురవేయాలి
-మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి
ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
-బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి
Brs l చౌటుప్పల్,ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 4, 5, 15, 7, 8, 14వ వార్డులలో ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి చౌటుప్పల్ మున్సిపాలిటీ పై మరోసారి బీఆర్ఎస్ జండా ను ఎగురవేయాలని ప్రభాకర్ రెడ్డి కోరారు. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు ఈనెల 11వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్ పాలనలోనే చౌటుప్పల్ ను మున్సిపాలిటీ కేంద్రంగా, ఆర్డీవో డివిజన్‌గా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అలాగే 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, సీసీ రోడ్లు, మిషన్ భగీరథ తాగునీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి కీలక అభివృద్ధి పనులన్నీ టీఆర్‌ఎస్ హయాంలోనే చేయడం జరిగిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా చౌటుప్పల్ లో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. మంత్రి పదవి ఆశలో రాజగోపాల్ రెడ్డికి మునుగోడు, చౌటుప్పల్ అభివృద్ధిపై దృష్టి లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే చౌటుప్పల్‌ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలు తుంగలో తొక్కిందని అన్నారు. మళ్ళీ ఆ పార్టీకి ఓటు వేయొద్దని మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించాలని కోరారు. తర్వాత రాష్ట్రంలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో కొయ్యడ శేఖర్, ఊదరి యాదయ్య, కానుగు యాదమ్మ బాలరాజు, సుక్క యాదయ్య, చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఊడుగు మల్లేశం గౌడ్, చౌటుప్పల్ పట్టణ అధ్యక్షులు బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, పెద్దింటి బుచ్చిరెడ్డి, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సుర్వి మల్లేష్ గౌడ్, ముప్పిడి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

