BRS | కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలి….

BRS | కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలి….

BRS | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ నాయకత్వం వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి నల్ల బ్యాడ్జీలు, నల్ల కడువాలు ధరించి బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ “రేవంత్ రెడ్డి డౌన్ డౌన్” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాస్తారోకో అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన కేసీఆర్‌పై కక్షపూరిత రాజకీయాలతో సిట్ నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు 60 లక్షల మంది కార్యకర్తలతో పాటు నాలుగు కోట్ల మంది ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, రాజకీయంగా కక్ష సాధిస్తే రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అంధకారమేనని హెచ్చరించారు.

ఇది చట్టపరమైన విచారణ కాదని, పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యేనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న అహంకారపూరిత రాజకీయ తీరును ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. సింగరేణి, సోలార్ టెండర్లు, ఇతర అక్రమాలపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ సిట్ నోటీసుల డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల అమల్లో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, టీఎన్జీవోస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, డాక్టర్ శ్రీహరి, పట్టణ అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర్లు, షేక్ రషీద్, మల్లగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply