ఉట్నూర్, జూన్ 19(ఆంధ్రప్రభ) : చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులపై దృష్టి సారించాలని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel) పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు చెందిన పేందూర్ విఘ్నేశ్వర్ ఇటీవల వారణాసిలో ఐఐటీ సీటు సాధించడంతో ఆ విద్యార్థిని ఎమ్మెల్యే ఈరోజు ఉదయం తన క్యాంపు కార్యాలయంలో శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విఘ్నేశ్వర్ (Vigneshwar) ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ప్రసిద్ధి గాంచిన వారణాసి ఐఐటీ విశ్వవిద్యాలయం (IIT Varanasi University) లో కెమికల్ ఇంజినీరింగ్ లో సీటు సాధించడం హర్షణీయమన్నారు. ప్రతి ఒక్కరూ విఘ్నేశ్వర్ లాంటి విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ గోండు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెస్రం గంగారాం, పెందుర్ ప్రభాకర్, మాధవ్, విఘ్నేశ్వర్ తండ్రి అశోక్, తదితరులు పాల్గొన్నారు.