(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) దార్శనికతకు ప్రతిరూపమైన క్వాంటమ్ వ్యాలీ (Quantum Valley) తో రాష్ట్రంతో పాటు దేశ ముఖచిత్రమే మారబోతోందని, దీంతో యువతకు ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (MP Keshineni Sivanath) అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్‌డీసీ) (APSSDC), కేశినేని ఫౌండేషన్ (Keshineni Foundation) ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో మెగా జాబ్ మేళాను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కలెక్టర్ డా.జి.లక్ష్మీశ.. కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. జాబ్‌మేళాలో 35కు పైగా సంస్థలు పాల్గొన్నాయి. ఎస్ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, పీజీ విద్యార్హతలతో ఉద్యోగాలు ఇచ్చేందుకు సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి.
ఈ సందర్బంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగావకాశాల కల్పనతో పాటు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రిమకవేత్త కావాలనే ఉద్దేశంతో ఎస్ఈఈడీఏపీ ద్వారా పెద్దఎత్తున నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉచితంగా భోజనం, వసతి కల్పిస్తూ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి పిలుపునిచ్చిన వికసిత్ భారత్, ముఖ్యమంత్రి నేతృత్వంలోని స్వర్ణాంధ్రకు యువతే రథసారథులు అని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతిఒక్కరూ ఎంటర్‌ప్రెన్యూర్ దిశగా అడుగులేయాలని సూచించారు.
వైబ్రెంట్ విజయవాడలో ప్రతిభకు కొదవలేదు…
వైబ్రెంట్ విజయవాడలో ప్రతిభకు కొదవలేదని.. అవకాశాలను అందిపుచ్చుకొని యువత కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవలని కలెక్టర్ డా.జి.లక్ష్మీశ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి యువతకు ఉద్యోగావకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ డా. ఎం.రమేష్, కార్పొరేటర్ సీహెచ్ ఉషారాణి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, జిల్లా ఉపాధికల్పన అధికారి సీహెచ్ మధుభూషన్‌రావు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

