Bridge | జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.!

Bridge | జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.!
వంతెనను ఢీకొని వాగులో పడ్డ బొలెరో వాహనం
ఒక మహిళ మృతి – ఆరుగురి పరిస్థితి విషమం
వాహనంలోని మరో ఐదుగురికి స్వల్ప గాయాలు
బోడ్డుగూడెం – ఏడుగుర్రాలపల్లి మధ్యలో ఘటన.
క్షతగాత్రులంతా చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారు
పొట్ట కూటి కోసం వచ్చి క్షతగాత్రులగా మారిన వైనం
Bridge | చింతూరు (పోలవరం జిల్లా), ఆంధ్రప్రభ: పోలవరం జిల్లాలోని చింతూరు ఏజేన్సీలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కూలీలు మిర్చి పనులకు వచ్చి ఆదివారం వెకువ జామున స్వరాష్ట్రానికి బొలెరో వాహనంలో తిరిగి వెళుతున్న క్రమంలో చింతూరు మండలం ఏడుగుర్రాలపల్లి – బొడ్డుగూడెం గ్రామాల మధ్య జాతీయ రహదారి 30పై వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కటేకళ్యాణ్ గ్రామానికి చెందిన ఒక మహిళ అక్కడక్కడే మృతి చెందింది.

ఆరుగురి పరిస్థితి విషమం – నలుగురికి స్వల్ప గాయాలు..
తెల్లవారు జామున ఎటపాక మండలం మూరుమూరు గ్రామం నుండి సీజీ 18 డీ 1666 నెంబర్ గల బొలెరో వాహనంలో చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా కటెకళ్యాణ్ గ్రామానికి చెందిన మొత్తం 13 మిర్చి కోతలకు వచ్చిన కూలీలు పనులు ముగించుకొని తిరిగి స్వరాష్ట్రాని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ తరుణంలో జాతీయ రహదారి 30 పై నూతనంగా నిర్మించిన వంతెనను బలంగా ఢీకొని రహదారి ప్రక్కనే ఉన్న వాగులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కటేకళ్యాణ్ గ్రామానికి చెందిన మడకం పైకే అనే మహిళ అక్కడక్కడే మృతి చెందగా మరో 11 మందికి గాయాలయ్యాయి. గాయపాలైన క్షతగాత్రుల్లో రమేష్, సోడె చుక్క, పోడియం పహ్లీ, మడకం పొజ్జి, మడకం ఆదమ్మ, మడివి బాల్మన్ అనే ఆరుగురి పెద్ద పెద్ద గాయాలవ్వడంతో పాటు బలమైన దెబ్బలు తగలడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కోన్నారు. ఇదే ప్రమాదంలో మరో ఐదుగురికి స్వల్ప గాయాలవ్వగా మరొకరు సురక్షితంగా బయట పడ్డారు.

పీహెచ్‌సీకి తరలించి ప్రధమ చికిత్సల తరువాత రిఫర్..
బొలెరో వాహనం ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న అధికారులు, 108 సిబ్బంది హుటహుటిన ఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ క్షతగాత్రులను ఏడుగుర్రాలపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యులు ప్రధమ చికిత్సలు అందించారు. ప్రధమ చికిత్సల తదుపరి ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా వైద్యశాలకు అంబులెన్స్ ద్వారా తరలించారు.

పొట్ట కూటి కోసం వచ్చి..
ప్రతి ఏడాది చత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏపీలోని కూనవరం, ఎటపాక మండలాలకు పొట్ట కూటి కోసం కూలీకి వస్తుంటారు. ఇదే క్రమంలో ఈ మిర్చి సీజన్‌కి మిరపకాయాలు కొయడానికి వచ్చిన కూలీలు మిర్చి పనులు పూర్తి కావడంతో తిరిగి స్వరాష్ట్రానికి తిరిగే వెళ్ళే క్రమంలో అతి వేగం కొంప ముంచి వాహనం ప్రమాదానికి గురైంది. పొట్టకూటి కోసం వచ్చి పుట్టెడు కష్టాలు పడి పనులు చేసుకొని ఇంటికి వెళుతుండగా విధి వక్రీకరించింది. ఈ ప్రమాదంపై చింతూరు పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. మహిళా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చింతూరు సీహెచ్‌సీకి తరలించారు.

