Bodhan | అవినీతి సొమ్ము పంచు కోవడంలో….

Bodhan | అవినీతి సొమ్ము పంచు కోవడంలో….

  • మంత్రులు బిజీబిజీ.

Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి సొమ్ము పంచుకోవడంలో బిజీ బిజీగా ఉన్నారని వారికి ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ద లేదని మాజీమంత్రి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు బోధన్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్బంగా ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్య మంత్రి, మంత్రులు అవినీతికి పాల్పడుతూ అభివృద్ధి నిధులు దోచుకుంటున్నారని అన్నారు. మేడారం జాతర కు మంజూరు అయిన నిధుల పంపకాలలో మంత్రులు కొట్టుకున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయాన్నారు.

ఎక్సైజ్ మంత్రికి తెలవకుండానే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే పనులు చక్కదిద్దడం పట్ల శాఖ మంత్రి వాపోయిన సంఘటన గుర్తు చేశారు. బొగ్గు కుంభకోణం బయటకు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతుందన్నారు.ముఖ్య మంత్రి స్థాయి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అవినీతి కుంభకోణాలలో కూరుకు పోయారని అన్నారు. సివిల్ సప్లై లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో కూరుకు పోయారన్నారు.

తెలంగాణ ఉద్యమ ద్రోహం చేసిన తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డికి మోజు పోలేదన్నారు. బీఆర్ఎస్ జండా ఎగరకుండా చూస్తానని బెదిరిస్తున్న రేవంత్ రెడ్డికి తమ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పార్టీ జెండాలను దిమ్మెలను కూల్చివేస్తే టిఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలనే సక్రమంగా అమలు చేయడం రేవంత్ రెడ్డికి సాధ్యం కావడం లేదన్నారు.

ప్రజలలో బిఆర్ఎస్ పట్ల అభిమానం పోలేదని అన్నారు.సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే రెండేళ్లు గడిచినప్పటికీ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏమాత్రం నిధులు మంజూరు చేయించలేదన్నారు. బీఆర్ఎస్ హయంలో బోధన్ మున్సిపల్ అభివృద్ధికి వంద కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అందులో 60 కోట్ల పనులు రహదారులు, సెంట్రల్ లైటింగ్, సీసీరోడ్డు, డ్రైనేజీలు చేపట్టడం జరిగిందన్నారు. మిగిలిన 40 కోట్ల నిధులతో పనులు చేపట్టడం లో సుదర్శన్ రెడ్డి విఫలం అయ్యారని అన్నారు.

ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అభివృద్ధి పనులకోసం నిధులు తీసుకురావడం చేత కాలేదని విమర్శించారు. శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో సుదర్శన్ రెడ్డి గెలవడం విజయం కాదన్నారు. ఇటీవల ఎన్నికలలో గెలిచిన సర్పంచులను కాంగ్రెస్ లో చేరాలని బెదిరించడం సరికాదని గుర్తు చేశారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పింఛన్ల పెంపు వంటి కార్యక్రమాలను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సభ్యులు వి.గంగాధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, షకీల్ అమేర్, పార్టీ జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ గంగారెడ్డి, పీఆర్ టీయు మాజీ రాష్ట్ర నాయకుడు రవికిరణ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీంద్ర యాదవ్, అయేషా ఫాతిమా, వివిధ మండలాల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply