నిందలు మోపడం దుర్మార్గం
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : నకిలీ మద్యంతో రాష్ట్ర ప్రజల ప్రాణాలతో వైసీపీ చెలగాటమాడుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న(Buddha Venkanna) విమర్శించారు. తప్పు చేయడం వైసీపీ డిఎన్ఏలోనే ఉందన్న ఆయన నకిలీ మద్యం వైసీపీ ప్రభుత్వంలోనే పురుడు పోసుకున్నట్లు గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో సూత్రధారులు పాత్రధారులు జైలుకు వెళ్లడం ఖాయమన్న ఆయన జోగి రమేష్ అరెస్టు వ్యవహారంలో బీసీ కార్డుతో బయట పడే ప్రయత్నం చేస్తూ కుల రాజకీయాలకు వైసీపీ(YCP) తెరదీసిందని ఆరోపించారు. త్వరలోనే నకిలీ మద్యం కారణంగా మరణించిన బాధ్యత కుటుంబాలతో తాడేపల్లి జగన్ ప్యాలెస్ ముందు ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు.
విజయవాడలోని ఎంపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తప్పుచేసి అరెస్టు అయిన జోగి రమేష్ చంద్రబాబు, లోకేష్( Lokesh) లపై నిందలు మోపడం దుర్మార్గం అని వారికి ఈ అరెస్ట్ తో ఎటువంటి సంబంధం లేదన్నారు. జనార్ధన్ రావు ఇచ్చిన సమాచారంతో జోగి రమేష్ ను అరెస్టు చేశారని, ఇప్పుడు జోగి రమేష్ విచారణలో జగన్ పేరు చెబుతాడన్నారు. అమ్మవారి గుడికి వెళ్లి దొంగ ప్రమాణం జోగి రమేష్ చేశారని, అందుకే అమ్మవారు వెంటనే ప్రభావం చూపిందన్నారు.
జగన్ కు కూడా ఈ నకిలీ మద్యం(fake liquor) కేసులో పాత్ర ఉందని, మద్యం కుంభకోణం కేసులో కూడా తాడేపల్లి ప్యాలెస్ కు డబ్బు చేరినట్లు నిర్ధారించారన్నారు. కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకువచ్చిన ఈ వ్యవహారంలో ఎటువంటి వారు ఉన్నా శిక్ష తప్పదని, టీడీపీ వారు ఉన్నా అరెస్టు చేయడమే కాకుండా సస్పెండ్ చేశారని గుర్తు చేశారు.

వైసీపీ జమానాలో ఒక్కడినైనా సస్పెండ్ చేశారా అని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్, దొంగ ప్రమాణాలు, దోచుకోవడం మొత్తం జగన్ కు తెలుసని, జగన్ పెద్ద దొంగ… జోగి రమేష్ లాంటి వాళ్లు చిన్న దొంగలని అభివర్ణించారు. అధికారంలో ఉంటే రంకెలు వేసే రమేష్… ఇప్పుడు పోలీసులు రాగానే బాత్రూమ్ లో దాక్కున్నాడని, దమ్ముంటే అరెస్టు చేయండి అన్న రమేష్.. ఇప్పుడు చంద్రబాబు వల్లే అరెస్టు అనడం ఏమిటన్నారు. బీసీలకు అప్పుడు ఇప్పుడు మేలు చేసింది టీడీపీ ప్రభుత్వం అని, జోగి రమేష్(Jogi Ramesh) ఇప్పుడు బీసీ కార్డు వాడితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు.
వైసీపీ హయాంలో జరిగిన బీసీ దాడుల పై మాట్లాడని కొందరు నేతలు జోగి రమేష్ వంటి వారు ఇప్పుడు రాజకీయం చేయడం దుర్మార్గం అన్నారు. కల్తీ మద్యం పేరుతో ప్రజలకు స్లో పాయిజన్ ఇచ్చారని, వారి ప్రాణాలు తీసి.. డబ్బులు దోచుకున్నారని, అటువంటి వ్యక్తికి జగన్ మద్దతు ఇవ్వడం దారుణం అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొప్పన బాబు కుమార్, తెదేపా సీనియర్ నేత చౌదరి ఉన్నారు.

