గ్యాస్‌కు బై… బొగ్గుకి జై!

గ్యాస్‌కు బై… బొగ్గుకి జై!
బొగ్గు స్టవ్‌పై టీ… వినూత్న ఆలోచనకు అభినందనలు
వినియోగదారుల సంఘం అభినందన
గుంటూరు, ఆంధ్రప్రభ : పట్టణంలోని కళామందిర్ సెంటర్‌లో ఓ టీ స్టాల్ యజమాని వినూత్న ఆలోచనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పెరుగుతున్న గ్యాస్ ధరలు, కమర్షియల్ సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెటింగ్ సమస్యల మధ్య అతను బొగ్గుల స్టవ్‌ను వినియోగంలోకి తీసుకొచ్చి టీ తయారు చేస్తూ వినియోగదారులకు వేడివేడిగా, రుచికరంగా అందిస్తున్నాడు.
ఇటీవల కాలంలో గ్యాస్ సిలిండర్ల ధరలు అధికమవడంతో చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా టీ స్టాల్స్, హోటళ్ల వంటి చిన్న స్థాయి వ్యాపారులకు ఇది భారంగా మారింది. ఈ నేపథ్యంలో బొగ్గుల కుంపటిపై టీ తయారు చేయడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా, సంప్రదాయ రుచిని కూడా అందిస్తున్నాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
బొగ్గు స్టవ్‌పై తయారైన టీకి ప్రత్యేకమైన సువాసన, రుచి ఉండటంతో వినియోగదారులు కూడా ఆసక్తిగా స్పందిస్తున్నారు. “ఇది పాత కాలం టీ రుచిని గుర్తు చేస్తోంది” అని పలువురు కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వినూత్న ప్రయోగాన్ని గుర్తించిన వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా నాయకులు మురికిపూడి ప్రసాద్, బేబీ విక్రమ్ టీ స్టాల్‌ను సందర్శించి యజమానిని అభినందించారు. చిన్న వ్యాపారులకు ఇది ఆదర్శంగా నిలుస్తుందని, ఇలాంటి ఆలోచనలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.
అదేవిధంగా, ఇంధన సంక్షోభం సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ఎంతో అవసరమని, ప్రభుత్వం కూడా చిన్న వ్యాపారులకు సబ్సిడీ, సహాయ పథకాలు అందించాలని వారు సూచించారు.
స్థానికంగా ఈ టీ స్టాల్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. బొగ్గుల కుంపటిపై వేడివేడి టీ కోసం ప్రజలు ఎక్కువగా వచ్చి ఆస్వాదిస్తున్నారు.
