హైదరాబాద్ ,ఆంధ్రప్రభ : యూసుఫ్‌గూడాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కేంద్రంలోని బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి ఓటు వేస్తే దేశభక్తుడు, లేకపోతే దేశద్రోహి అన్నట్లుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని మహేష్ గౌడ్ విమర్శించారు. మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి బీసీ కోటాలోనే వచ్చిందని, ఇది నాలుగు నెలల క్రితమే నిర్ణయించినట్లు తెలిపారు.
బీజేపీ విడుదల చేసిన చార్జ్‌షీట్‌ను ప్రజలు విశ్వసించరని, అది కేవలం పాంప్లెట్ మాత్రమేనని అన్నారు. “రామచంద్రరావు, మీరు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, 12 సంవత్సరాల్లో ఎన్ని ఇచ్చారు?” అని ప్రశ్నించారు. పబ్లిక్ సెక్టార్ మొత్తాన్ని ప్రైవేటు పరం చేశారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మీద వ్యాపారం చేసి ఇప్పటి వరకు రూ. 65 లక్షల కోట్లు ఆర్జించిందని, అది సామాన్యునికి దక్కలేదని అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో రూ.60 ఉన్న పెట్రోల్ ఇప్పుడు రూ.100 దాటిందని, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినా, లీటర్‌కి రూ. 60 అదనంగా వసూలు చేస్తూ పేదలపై భారం వేస్తున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ మెట్రోను ఆపుతున్నారని మహేష్ గౌడ్ ఆరోపించారు. ప్రజల ఆలోచన ప్రభుత్వ పనితీరును మారుస్తుందని, కంటోన్మెంట్‌లో గెలిచిన మాదిరిగానే జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమంతోనే జూబ్లీహిల్స్‌లో విజయం సాధిస్తుందని అన్నారు. ఈ ప్రాంతంలో రూ. 4 వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. దివంగత నాయకుడు పీజేఆర్ ఆత్మ తమతోనే ఉందని, ఆయన కూతురు తమ పార్టీలో ఉన్నారని గుర్తుచేశారు. 1999లో తనకు సీటు రావడానికి సీఎల్‌పీ లీడర్‌గా పీజేఆర్ ఎంతో కష్టపడ్డారని, పీజేఆర్‌పై అభిమానం ఉన్న ప్రతి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, శివసేన రెడ్డి, గిరిధర్ రెడ్డి, జాన్సీ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

