పోలీసుల తనిఖీలపై బీజేపీ ఆగ్రహం..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : పోలీసులంటే ప్రజలకు రక్షకులా, భక్షకులా, శిక్షకులా అన్న అనుమానం కలుగుతోందని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ విమర్శించారు. గురువారం ఉట్నూర్‌లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల పనితీరు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆరోపించారు. ప్రతిరోజూ వాహనాల తనిఖీ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతోనే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ చలాన్ల పేరుతో వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఇది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.
ఆర్టీఏ అధికారుల పని కూడా పోలీసులు నిర్వహిస్తున్నారని, ఏఎస్పీ నుంచి డీఎస్పీ, సీఐ, ఎస్ఐల వరకు రోడ్లపైకి వచ్చి వాహనాలను తనిఖీ చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు.
ప్రజలు పన్నులు చెల్లించడం వల్లనే ప్రభుత్వాలు నడుస్తున్నాయని, ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయని చెప్పారు. అలాంటి పరిస్థితిలో వ్యవసాయం, కూలి పనులు చేసుకునే వారి నుంచి డబ్బులు వసూలు చేయడం అన్యాయమని అన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో, ముఖ్యంగా ఆసుపత్రులకు వెళ్లే వాహనాలను గంటల తరబడి ఆపడం సరైంది కాదని సూచించారు. ప్రస్తుతం పోలీసుల పనితీరు నిజాం పాలనను తలపించేలా ఉందని విమర్శించారు.
ప్రతిరోజూ తనిఖీల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమని హెచ్చరించారు. పోలీసుల వైఖరి మారకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని తెలిపారు.
ఈ సమావేశంలో బీజేపీ నిర్మల్ జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, ఉట్నూర్ మండల అధ్యక్షుడు బింగి వెంకటేష్, గుంటూరు మాజీ జెడ్పీటీసీ సాడిగే గంగన్న, మాజీ ఎంపీపీ ధన్ లాల్, మాజీ ఎంపీటీసీ కందుకూరి రమేష్, బీజేపీ నాయకులు సిపతి లింగ గౌడ్, కొమ్ము రామచందర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
