హైదరాబాద్, ఆంధ్రప్రభ : కోళ్లకు సోకుతున్న బర్డ్ ఫ్లూ వైరస్ తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అందరు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో భారీ సంఖ్యలో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ ప్లూయెంజా (హెచ్5ఎన్1 – బర్డ్ ప్లూ) వైరస్ కారణమని నిర్ధారించారు. ఈ వ్యాధి కోళ్లలో వేగంగా వ్యాపిస్తూ తెలంగాణకు కూడా విస్తరించనుందన్న సమాచారం నేపథ్యంలో కొన్ని రోజులు కోళ్ల పెంపకం.. మాంసం వినియోగం పట్ల జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తగా ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలంగాణ పశుసంవర్ధక, మత్స్యశాఖ విభాగం తెలిపింది. అలాగే చికెన్ వంటకాలకు కొన్ని రోజులు తెలంగాణ ప్రజలు దూరంగా ఉండాలని కోరింది..
కోళ్లు, ఇతర జంతువులలో సంభవించే అనుమానస్పద, వైరస్ మరణాల వివరాల పట్ల కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. కోళ్ల పెంపకందారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమై బర్డ్ ప్లూ వ్యాప్తి, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించాలని పేర్కొంది. జిల్లాలోని కోళ్ల ఫారాల్లో కోళ్లు చనిపోతే వెంటనే సంబంధిత వెటర్నీ దవాఖానలో సమాచారం ఇవ్వాలని యాజమానులకు సూచించారు.