Bihar | విజయాలిచ్చి….అపజయం పొంది..
- వ్యూహాలు సూత్రప్రాయమే..
- యుద్ధానికి పోరాటపటిమ, అనుభవం అవసరం
- ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయొద్దు.
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఓటమి పై స్వీయ సమీక్ష, విశ్లేషణ, తదుపరి విజయానికి నాంది అవుతుంది.
అదే స్వీయ సమీక్ష లేకుండా, గెలిచిన వారిపై అక్కసు వెళ్ళగక్కడం, విజయం నిర్ధారించిన వ్యవస్థలో లోపాలున్నాయని ఆరోపించడం వంటివి ఆత్మద్రోహం, ఆత్మవంచన అవుతుంది తప్ప, ప్రయోజనం ఉండదు. ఇదే వైఖరితో ఇప్పుడు అనేక రాజకీయ పార్టీలు వరుస అపజయాలతో కునారిల్లుతున్నాయి. విజయాలను చేరుకోలేకపోతున్నాయి.
Bihar | వాళ్ళెక్కడ? వీళ్ళెక్కడ?
ఒకప్పుడు ఎన్నికలలో ఓటమి పాలైతే హుందాగా “సమీక్ష చేసుకుంటాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల తరపున పోరాడతాం” అనే వారు. ఇప్పుడు కాస్తా ఆ ఓటమిని ఈవీంల పైకి నెట్టడం, లేదా గెలిచినవారు డబ్బు ఆశచూపి ఓట్లు కొన్నారని అనడం చాలా సర్వ సాధారణమైపోయింది. ఇక్కడ వాళ్ళ టార్గెట్ గెలిచిన వారే అయినా, ఆ మాట వల్ల “డబ్బుకి లొంగిపోయారు” అని ప్రజలను కించపర్చడం అనే సంగతి విస్మరిస్తున్నారు. లాజిక్ మిస్ అవుతున్నారు. తదుపరి తమ అపజయానికి తామే కారణమవుతున్నారు.
ఇక ఇటీవల బీహార్ లో జరిగిన ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన నితీశ్ కుమార్ చేతిలో చిత్తయిన మిగతా పార్టీల విషయానికొస్తే, మహా గఠ్ బంధన్ వద్ద చెప్పడానికి కారణాలేం కనిపించలేదు. అందుకే మిన్నకుండిపోయింది అని విశ్లేషకుల అభిప్రాయం.
అంతకు ముందు ఎన్నికల వ్యూహకర్తగా పార్టీలకు సలహాలిచ్చిన ప్రశాంత్ కిషోర్ స్వయంగా బరిలోకి దిగి నితీశ్ కుమార్ చేతిలో చిత్తయిపోయారు. ప్రజాక్షేత్రంలో పర్యటించినా, అనేక హామీలిచ్చినా, ప్రశాంత్ కిషోర్ ను ప్రజలు నమ్మలేదన్నది వాస్తవం. లేదా, నితీశ్ గత సుపరిపాలన ముందు అవన్నీ తేలిపోయాయనుకోవచ్చు.
Bihar | నితీశ్ ను ప్రశాంత్ కిషోర్ గమనించలేదు

ఎన్నికల వ్యూహాలు ఎక్కడికక్కడ ప్రత్యేకమైనవి. అవి ఆయా ప్రాంతాల ఓటర్ల భావోద్వేగాలకు, స్థానిక సమస్యలకు సంబంధించినవి. వాటిని అర్థం చేసుకున్న నాయకులకు తిరుగుండదు. నితీశ్ అధికారంలోకి రావడానికీ, ముఖ్యమంత్రిగా ఇన్నేళ్ళు కొనసాగడానికీ అదే కారణం. అప్పటిదాకా అధికారంలో ఉన్నవాళ్ళు చేసిన, చేస్తున్న పొరపాట్లేమిటి? వాళ్ళపట్ల ఏ విషయాల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనే విషయాలు ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేసారు అప్పట్లో.
ఓటమి అనంతరం ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ నితీశ్ లాగా బీహార్ ను తాను అర్థం చేసుకోలేకపోయానని అన్నారు. కానీ, సునిశితంగా గమనిస్తే ఇది లాజిక్ లేని సమీక్ష లాగా అనిపిస్తుంది. ఇందులో లోతైన సమీక్ష కాదనిపిస్తుంది. ఎందుకంటే, బీహార్ ను అర్థం చేసుకోవడం కన్నా, నితీశ్ ను ప్రశాంత్ కిషోర్ గమనించలేదు, అర్థం చేసుకోలేదు అని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. నితీష్ అప్పటికే బీహార్ లో అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వ్యక్తి. ఆయన ఎవ్వరితో జతకట్టినా, ఎవ్వర్ని ఎవ్వరితో విబేధించినా ప్రజలు ఆమోదిస్తూ వచ్చారు.
అంతకు ముందు జంగిల్ రాజ్ పాలన గా పేరు తెచ్చుకున్న లాలూ కుటుంబం సాగించిన హింస, దుశ్చర్యల నుంచి బీహార్ ను ప్రశాంతంగా మార్చిన రికార్డ్ నితీశ్ సొంతం. అలాంటి నితీశ్ ను గమనించి, అతనిలోని లోపాలను చూపగలిగితే, లేదా అంతకంటే గొప్ప పాలన తాను ఇవ్వగలనని ప్రజలకు నమ్మకం కలిగించితే ప్రశాంత్ కిషోర్ తప్పక అధికారంలోకొచ్చేవారు. కానీ, నితీశ్ రికార్డును ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా, కేవలం అధికారంలో ఉన్న వ్యక్తిపై విమర్శలు గుప్పించినంత మాత్రాన అధికారంలోకొచ్చేయవచ్చనే అభిప్రాయానికి ప్రశాంత్ కిషోర్ ఎలా వచ్చారో చాలామందికి అస్సలు అర్థం కాలేదు.
ఈ అపజయం వల్ల ప్రశాంత్ కిషోర్ కి రెండు విధాల నష్టం కలిగిందని చెప్పవచ్చు.
నితీశ్ ను వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఇటు ప్రశాంత్ కిషోర్ గానీ, అటు మహాగఠ్ బంధన్ గానీ గమనించలేదు. అది ప్రజల్లోకి మరిత తప్పుడు సంకేతాలను పంపింది. ఎవ్వరు ఏ విమర్శలు చేసినా, అప్పటిదాకా నితీశ్ అందించిన సుపరిపాలనపై మాత్రం వ్యతిరేక ప్రభావం చూపలేకపోయింది. అది ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది.
రాజకీయాల్లో శాశవత శత్రువులు కానీ, శాశ్వత మిత్రులు కానీ ఉండరాన్న సూత్రాన్ని నితీశ్ అర్థం చేసుకున్నంతగా మరెవ్వరూ అర్థం చేసుకోలేదన్నది నిజం. ఎవరిని ఎప్పుడు శత్రువులుగా చూడాలో, ఎప్పుడు మిత్రులుగా చూడాలో నితీశ్ కు బాగా తెలుసు. అందుకనే నితీశ్ జతకట్టినా, జత వీడినా అది ఊగిసలాటగానే భావిస్తారు తప్ప, వాళ్ళవైపు శాశ్వతంగా ఉంటారని ఎవ్వరూ అనుకోరు.
ప్రశాంత్ కిషోర్ లోని వ్యూహకర్త ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. సొంతరాష్ట్రమైన బీహార్ లోనే గెలవలేకపోయినప్పుడు, మరో రాష్ట్రానికి వెళ్ళి, పోటీ చేసేయడం ప్రశాంత్ కిషోర్ కు సాధ్యం కాకపోవచ్చు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏయే రాష్ట్రాలు ప్రశాంత్ కిషోర్ నుంచి వ్యూహాలను ఆశిస్తున్నాయో ఎవరెవరు అతడిని సంప్రదిస్తారో చెప్పలేం. వ్యూహాలను రచించడం టేబుల్ వర్క్ కనుక, అందిన రిపోర్ట్ లు, చేయించే సర్వేల ఆధారంగా ప్రశాంత్ కిషోర్ తిరిగి తన ప్రొఫెషన్ ను తాను కొనసాగించవచ్చు.
Bihar |ఒకట్రెండు సంవత్సరాలైనా వేచి చూడాలి.
ఒకటి తిరిగి అయిదేళ్ళవరకూ వేచి చూడడం, అప్పటి వరకూ నిరంతరంగా ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడడం. అది ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ప్రజల నుండి స్పష్టమైన మద్దతుతో మరోమారు సీఎం సీటులో కూర్చోబోతున్నారు నితీశ్. ఆయన పాలనలో తప్పులు పట్టడం అంటే కనీసం ఒకట్రెండు సంవత్సరాలైనా వేచి చూడాలి. ఇక రెండవది…ఇప్పటి దాకా ఎన్నికల వ్యూహాలు రచించి రాజకీయ పార్టీల నుండి దండిగా ఫీజులు తీసుకున్న ప్రశాంత్ కిషోర్ వద్దకు సలహాల కోసం ఇప్పట్లో ఎవ్వరూ రాకపోవచ్చు. తానే ఓడి ఉన్నాడు, మాకేం సలహాలిస్తారనే సెంటిమెంట్ కొనత్కాలం వెంటాడవచ్చు.
ఈ పరిణామాల వల్ల ప్రశాంత్ కిషోర్ గమనించాల్సిన ముఖ్యమైన విషయం…
నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే….వ్యూహాలు రచించడం వేరు…యుద్ధం చేయడం వేరు అని…
మరి ఇకపై ప్రశాంత్ కిషోర్ ఇతర పార్టీల విజయాలకై వ్యూహరచనలకు పరిమితమవుతారా, లేక ప్రజాక్షేత్రంలో నిలిచి, మళ్ళీ నితీశ్ తో తలపడి గెలుపుకై నిరీక్షిస్తారా? అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే….

