Bhuj Visit | ఆప‌రేష‌న్ సిందూర్ ట్రైల‌ర్ మాత్రమే.. అసలు కథ ముందుంది – ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్

ముందుంది అసలు సినిమా
భుజ్ ఎయిర్ బేస్ సిబ్బందితో ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్
కేవ‌లం 23 నిమిషాల‌లో పాక్ ఎయిర్ బేస్ లు ధ్వంసం
ఈ దాడుల‌తో ప్ర‌పంచానికి భారత్ శ‌క్తి తెలిసింది
పాక్ కు సాయం అంటే ఉగ్ర‌వాదుల‌కు సాయం చేసిన‌ట్లే

భుజ్ – గుజరాత్ – ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో చూపించామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. గుజరాత్‌లోని భుజ్ ఎయిర్‌బేస్‌ను నేడు ఆయ‌న సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పాకిస్థాన్‌పై భారత్‌ విజయానికి భుజ్‌ ప్రత్యక్ష సాక్ష్యం అని తెలిపారు. పాకిస్థాన్‌ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామని.. మన వాయుసేన అసమాన పరాక్రమం చూపిందని కొనియాడారు. సరిహద్దు దాటకుండానే పాక్‌లోని టార్గెట్స్‌ను ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఆప‌రేష‌న్ సిందూర్ ద్వారా ట్రైల‌ర్ మాత్ర‌మే చూపామ‌ని, తోక జాడిస్తే అసలు సినిమా చూపిస్తామ‌ని పాక్ ను హెచ్చ‌రించారు.

పాకిస్థాన్.. భుజ్ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకుందని.. క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిందని.. వీటిన్నింటినీ భారత వాయుసేన తప్పికొట్టిందని వెల్లడించారు. మన భూభాగంపై ఎలాంటి నష్టం జరగకుండానే అడ్డుకుందని తెలిపారు. భారత వాయుసేన.. పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం, అలాగే మౌలిక సదుపాయాలను నాశనం చేసిందని పేర్కొన్నారు.

పాక్ సాయం అంటే ఉగ్ర‌వాదుల‌కు సాయం చేసిన‌ట్లే..

భారత్‌పై ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్‌కు 2.1 బిలియన్ డాలర్ల బెయిలౌట్‌ను పున:పరిశీలించాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి ను కోరారు. ప్రస్తుతం ఐఎంఎఫ్ రెండు విడతలగా 2.1 బిలియన్ల సాయం చేస్తోంది. ఆ సాయాన్ని నిలిపివేయాలని రాజ్‌నాథ్‌సింగ్ విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్‌కు సాయం చేస్తే పరోక్షంగా ఉగ్రవాదానికి నిధులు ఇచ్చినట్లే అవుతుందని తెలిపారు. పాకిస్థాన్‌కు ఇచ్చే ఏదైనా ఆర్థిక సహాయం అది ఉగ్రవాదానికేనని.. దీంతో ఐఎంఎఫ్ తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని డిమాండ్ చేశారు.

పాకిస్తాన్‌లోని ప్రతి మూలకు ఉగ్రవాదం దాగి ఉన్న ప్రతి చోటికి కూడా తాము చేరుకోగలమని ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి నిరూపించినందుకు ఐఏఎఫ్‌ను రక్షణ మంత్రి ప్రశంసించారు. ప్రజలు అల్పాహారం తీసుకునే సమయంలోపే వాయుసేన పాక్ ఉగ్రవాదులను హతమార్చారని కొనియాడారు. పాకిస్థాన్ చాలా కాలంగా ఉగ్రవాద సంస్థలను పెంచిపోషిస్తోందని.. ఉగ్రవాదులకు పాకిస్థాన్ సురక్షిత స్వర్గధామంగా మారిపోయిందని.. ఒసామా బిన్ లాడెన్ కూడా 2011లో పాకిస్థాన్‌లోనే దాక్కుకున్నట్లు గుర్తుచేశారు.

Leave a Reply