Bhimgal Town | ఆడపిల్ల పుడితే ఐదు వేయిల సహాయం

Bhimgal Town | ఆడపిల్ల పుడితే ఐదు వేయిల సహాయం

  • దుబాయ్‌లో శ్రీకారం చుట్టిన పిప్రి వాసి,
  • ఆడపిల్లను బ్రతనిద్దాం అంటూ నినాదం

Bhimgal Town | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : అతనో సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి. బాల్యం నుండే కష్టాలు ఎలా ఉంటాయో గ్రహించాడు. కుటుంబ ఆర్థిక స్థితి, గతులను చూసి ఎలాగైనా తన కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని, తనతో పాటు పదిమందికి ఉపాధి అందించాలని తలిచాడు. పొట్టచేత పట్టుకుని ఉపాధి కొరకు విదేశాలకు వెళ్లి అక్కడ కూడ మొదట్లో కష్టాలు పడ్డాడు.

తీరా మెల్లి మెల్లిగా ఆర్థికంగా నిలదొక్కుకుని క్లాసిక్ పవర్ టెక్నీషియన్ కంపెనీ స్థాపించి పది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు భీమ్‌గల్‌ మండలం పిప్రి (జె)గ్రామానికి చెందిన వేముల సురేష్. దుబాయ్‌లో తను స్థాపించిన కంపెనీలో పని చేస్తున్న గ్రూప్ సభ్యుల ఇంట్లో ఎవరికైతే ఆడపిల్ల పుడుతుందో ఆ కుటుంబానికి రూ. 5000, అందజేయడం జరుగుతుందని ప్రకటించారు.

అందుకొరకు యూఏఈ తెలుగు డ్రైవర్స్ హెల్పింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసి పథకాన్ని తన గ్రూప్ సభ్యులకు అమలు చేస్తున్నారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డ కు రూ. 5000 అందజేస్తున్నారు. తనను ఆదర్శంగా తీసుకుని ఎవరైనా హెల్పింగ్ గ్రూప్ కు సహకారం అందించాలని కోరుతున్నారు.

ఇండియాలోను అమలు..

ఆడపిల్ల పుడితే రూ 5000, అందించే కార్యక్రమం ఇండియా లోని తన స్వగ్రామం పిప్రి లో కూడ త్వరలో అమలు చేస్తానని వేముల సురేష్ తెలిపారు. తాను సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి గా మంచి కార్యక్రమంతో ముందుకు తెస్తున్న ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి గ్రూప్ ద్వారా హెల్ప్ చేయాలని కోరారు. నేటి రోజుల్లో ఆడపిల్ల భారం అనుకునే తల్లి, తండ్రులకు బాధ్యత అనేలా చేద్దామని తెలిపారు. భవిష్యత్తు లో ఆడపిల్లల కొరకు అనేక కార్యక్రమాలు చేసేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని సురేష్ కోరారు.

Leave a Reply