Bhimavaram | అన్నదాతల అవస్థలు..

Bhimavaram | అన్నదాతల అవస్థలు..

Bhimavaram, భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ఈ ఏడాది ఖరీఫ్ రైతులకు వాతావరణం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత నెలలో మొంథా తుపాను (Mondha cyclone) ప్రభావంతో వీచిన ఈదురు గాలులకు 65 వేల ఎకరాల్లో వరి చేలు నేలమట్టమయ్యాయి. కోతకు వచ్చిన వరి చేలలో నేటికీ వర్షాల వల్ల ఏర్పడిన బురద తగ్గకపోవడం, చేలు ఆరకపోవడంతో వరి కోతల సమయంలో రైతులు (Farmers) పడరాని పాట్లు పడుతున్నారు. చేలలో చెమ్మ ఉండడంతో వరి కోత యంత్రాలు దిగబడిపోయి వరి కోతకు రెట్టింపు సమయం పట్టడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇన్ని కష్టాలను ఎదుర్కొని పంటను గట్టుకు చేర్చినా ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉండడంతో ఆరబెట్టడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుంది. వాతావరణం మబ్బులతో నిండి చల్లగా ఉండటంతో ధాన్యంలో తేమశాతం తగ్గనంటూ రైతు ఇబ్బంది పెడుతుంది. మరో వైపు వరస అల్పపీడనాలు ఖరీఫ్ రైతులకు నేనున్నానంటూ వెంటాడుతున్నాయి.

పొంచి ఉన్న అల్పపీడనం..
రెండు వారాల క్రితం ఏర్పడిన తుపాను ప్రభావంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఖరీఫ్ రైతులు గత వారం రోజులుగా జిల్లాలో ముమ్మరంగా వరి కోత యంత్రాలతో కోతలు కోస్తున్నారు. ఇలా కోసిన ధాన్యాన్ని సమీపంలోని గట్ల పైకి రహదారుల వద్దకు చేర్చి ఆర పెడుతున్నారు. ఎంతో కీలకమైన ఈ సమయంలో ఈ నెల 17న మరో అల్పపీడనం ఏర్పడవచ్చు అనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వచ్చిన వర్షాల వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతులకు మరో మారు వర్షాలు పడితే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికంగా తేమశాతం..
నిబంధనల ప్రకారం 17 శాతం లోపు తేమ ఉంటే ధాన్యానికి మద్దతు ధర అందుతుంది కానీ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ధాన్యంలో తేమశాతం 22 శాతానికి పైగా ఉంటుంది. ఈ తేమ శాతానికి తగ్గించడానికి రోజుల తరబడి ఆరుబయట ఆరబెట్టినా మబ్బులు కారణంగా తగ్గటం లేదు. రోజు కూలీలు ఖర్చు అధికం కావడంతో పాటు ఎప్పుడు వర్షం వచ్చి ముంచేస్తుందో తెలియకుండా వాతావరణం రైతులను భయపెడుతుంది. తేమ శాతంతో నిబంధన లేకుండా వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులకు కోరుతున్నారు.

ధాన్యం సేకరణ లక్ష్యం..
జిల్లాలో ఈ ఏడాది 5 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయించుకున్నారు. 252 రైతు సేవ కేంద్రాలలో, 110 సహకార సంఘాలలో ధాన్యం కొనుగోలు చేయనున్నారు. ధాన్యం సేకరణ కోసం 1.25 కోట్ల గోనె సంచులను సిద్ధం చేశారు. వీటిలో ఇప్పటికే సుమారు 30 లక్షల సంచులను ఆయా రైతు సేవా కేంద్రాలలో సహకార సంఘాల వద్ద రైతులకు అందుబాటులో ఉంచారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389 ధరను, కామన్ రకానికి 2,369 ధరను నిర్ణయించారు.

రైతులు నష్టపోవద్దు- జేసీ
రైతులు దళారుల మాటలు నమ్మి నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే ధాన్యాన్ని విక్రయించుకోవాలి. ప్రతి రైతు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చేందుకు అవగాహన కల్పిస్తున్నాం. ధాన్యం సేకరణ కోసం 1.25 కోట్ల సంచులను సిద్ధం చేశాం. తేమ శాతంలో హెచ్చుతగ్గులు లేకుండా అన్నిచోట్ల ఒకే రకమైన యంత్రాలను ఏర్పాటు చేశాం. రైతు సేవ కేంద్రం వద్ద తీసిన తేమ శాతాన్ని మిల్లర్లు పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. ధాన్యం విక్రయంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా పరిష్కరించేలా టోల్ ఫ్రీ నెంబర్లు, అధికారులను ఏర్పాటు చేశామని పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి (T.Rahul Kumar Reddy) తెలియచేశారు.

Leave a Reply