న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్‌..

న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్‌..

  • తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి
  • ఎకరాకు 50 వేల నష్టపరిహారం చెల్లించాలి
  • సీపీఎం మండల కార్యదర్శి వర్ధం సైదులు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి వర్ధం సైదులు గురువారం నాడు డిమాండ్‌ చేస్తూ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలోని పరిపాలనాధికారి సలాం ఉద్దీన్‌కు రైతుల సమస్యలపై డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అచ్చంపేట మండలంలో కురిసిన భారీ వర్షాలు రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని, రైతులు వేసుకున్న పత్తి, జొన్న, మొక్కజొన్న, వరి, పల్లి వంటి పంటలు పూర్తిగా నాశనం కావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) మండల కార్యదర్శి వర్ధం సైదులు పేర్కొన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి వేసిన పంటలు కోతకు సిద్ధమైన సమయంలో వర్షాలు కురవడంతో పంటలన్నీ నీట మునిగిపోయాయని, అప్పులు తెచ్చి పంటలు వేసిన రైతులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే రెవెన్యూ, వ్యవసాయ శాఖల ద్వారా సర్వే నిర్వహించి నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు 50 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జూన్‌ నెల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతులు పెట్టుబడి పెట్టిన‌ మొత్తం డబ్బు వృథా అయిందని, రెండో పంట పల్లి వేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని అన్నారు. పల్లీ విత్తనాలు మొలకెత్తకపోవడం వల్ల రైతులు మరింత నష్టపోతున్నారని, ప్రభుత్వం సబ్సిడీ ద్వారా విత్తనాలు అందించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎస్‌. మల్లేష్‌, సయ్యద్‌ వెంకటయ్య, ఇస్సాక్‌, ఎల్లమ్మ, రాములు, నారాయణ, విద్యార్థి నాయకులు ఫాసిన్‌, సందీప్‌, శివ, అరవింద్‌, నవీన్‌, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Leave a Reply