Bhavani Deeksha | పరిసమాప్తం…

Bhavani Deeksha | పరిసమాప్తం…
- భవానీ దీక్షల విరమణ పూర్తి
- పూర్ణాహుతితో ముగిసిన ఉత్సవాలు
- రాష్ట్రం, దేశం, నలుమూలల నుండి భవానీల రాక
- పుణ్యస్నానాలు..పవిత్ర గిరిప్రదక్షిణ
- నియమ నిష్ఠలతో దీక్షలు పూర్తి..
- కనకదుర్గమ్మకు పవిత్ర ఇరుముడి సమర్పణ
- 5 రోజుల్లో సుమారు 6 లక్షల మంది రాక
- 23 లక్షల లడ్డు విక్రయాలు
- రెండున్నర లక్షలకు పైగా అన్న ప్రసాద వితరణ
- తలనీలాలు సమర్పించుకున్న 52 వేల మంది భవానీలు
- అధికారుల సమన్వయంతో దీక్షల విరమణ విజయవంతం
- ఈవో, చైర్మన్ పని తీరుపై ప్రశంసలు
Bhavani Deeksha | (ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : అత్యంత వైభవంగా అట్టహాసంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జరిగిన భవానీ దీక్షల విరమణ మహోత్సవం పరిసమాప్తి అయింది. ఈనెల 11వ తేదీ గురువారం అగ్ని ప్రతిష్టాపనతో ప్రారంభమైన ఇరుముడి విరమణ మహోత్సవాలు ఐదవ రోజు సోమవారం నిర్వహించిన మహా పూర్ణాహుతితో ముగిశాయి.

మహా పూర్ణాహుతితో వైభవంగా ముగింపు
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగిన భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు ఐదవ రోజు పూర్ణాహుతితో దిగ్విజయంగా ముగిశాయి. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలతో కృష్ణమ్మ ఒడిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దేవస్థానం స్థానాచార్యులు శివ ప్రసాద్, ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్, ఇతర వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పాత యాగశాలలో సోమవారం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడింది. ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు శాస్త్రం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో భవానీ దీక్షలు శుభప్రదంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్, ముఖ్య పండుగ అధికారి మూర్తి,ట్రస్ట్ బోర్డు సభ్యులు, దుర్గమ్మ దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
ఐదు రోజులు ఆరు లక్షల భవాని రాక…
ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఐదు రోజులు పాటు నిర్వహించిన భవాని దీక్షల విరమణ సందర్భంగా సుమారు 6 లక్షల మంది భవాని భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రం దేశం నలుమూలల నుండి భవాని దీక్ష ఆచరించిన వారందరూ కనకదుర్గమ్మను దర్శించుకునే పవిత్ర ఇరుముడిని సమర్పించారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ ఉత్సవాలలో భాగంగా ఉత్తరాంధ్ర నుండి అత్యధిక సంఖ్యలో భవానీలు అమ్మవారి ఆలయానికి రాగా, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి గుంటూరు జిల్లాల నుండి భవానీలు కాలినడకన ఇంద్రకీలాద్రి కి ఇరుముడి సమర్పించేందుకు తరలివచ్చారు. నాలుగవ రోజు ఆదివారం అర్ధరాత్రి సమయానికి 5,15,000 మంది భవానీలు రాక సోమవారం ఇంకో 60 వేల మంది భవానీలు అమ్మ దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. అమ్మవారి ఆలయంలో అత్యంత పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని భవానీలు 23 లక్షలకు పైగా లడ్డూలను కొనుగోలు చేయగా అమ్మవారి ఆలయంలో 24 గంటలు పాటు ఏర్పాటుచేసిన అన్నప్రసాదాన్ని రెండున్నర లక్షలకు పైగా భవానీలు స్వీకరించారు. భవాని దీక్ష అనంతరం అమ్మవారికి పవిత్ర తలనీలాలను 2.10 లక్షల మంది కల్యాణకట్టలో సమర్పించుకున్నారు.

సమన్వయంతో విజయవంతం..
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించిన భవాని దీక్షల విరమణ కార్యక్రమం అన్ని శాఖల అధికారులు సిబ్బంది సహకారం సమన్వయంతో విజయవంతం అయింది. ఈ నెల 11వ తేదీ నుండి ప్రారంభమైన ఈ దీక్ష విరమణ ఉత్సవాలు ఐదు రోజులపాటు సోమవారం వరకు కొనసాగగా ఇందులో ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఎలక్ట్రికల్ ఫైర్ హెల్త్ ఇలా అన్ని శాఖల విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది భాగస్వాములై ఉత్సవాలు విజయవంతంలో కీలకపాత్ర పోషించారు. ఉత్సవాల ప్రారంభానికి 10 రోజుల ముందే పూర్తి ప్రణాళిక బద్ధంగా సెక్టర్ల వారీగా పనులను విభజించిన ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు కనిపించారు. భవానీలకు అవసరమైన ఆహార పదార్థాలు తాగునీరు బిస్కెట్ ప్యాకెట్లు పాలు ఉచితంగా పంపిణీ చేయగా గిరిప్రదక్షిణ జరుగుతున్న ప్రాంతాలలో భవానీలకు ఉచితంగా అన్న ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో 24 గంటల పాటు భవానీలకు అవసరమైన అన్నప్రసాదాన్ని అందజేశారు. సుమారు నాలుగు వేలకు పైగా పోలీసులు ఈ ఉత్సవాల సందర్భంగా భారీ బందోబస్తు నిర్వహించారు. 2200 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు తమకు కేటాయించిన మూడు షిఫ్టుల్లో బాధ్యతగా పనిచేస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తెలెత్తకుండా సమన్వయంతో పని చేశారు.
నిత్యం క్షేత్రస్థాయిలోనే ఈవో చైర్మన్..
భవాని దీక్షల విరమణ సందర్భంగా ఐదు రోజులపాటు దేవస్థానం ఈవో సేనా నాయక్ దుర్గ గుడి పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీలు క్షేత్రస్థాయిలోనే ఉంటూ భవానీలకు ఎక్కడ ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ వచ్చారు. ఇంద్రకీలాద్రితో పాటు కనకదుర్గ నగర్ గిరి ప్రదక్షిణ జరుగుతున్న ప్రాంతాలు కేశఖండనశాల ఘాట్లు ఇలా అన్ని ప్రాంతాలను నిత్యం పర్యటిస్తూ అక్కడ ఏర్పాటులను పర్యవేక్షించడంతోపాటు భవానీల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ వచ్చారు. వీరితోపాటు పాలకమండలి సభ్యులు విభాగాలు వారీగా విభజించుకుని అన్నదానం కేశఖండన లడ్డు ప్రసాదం ఇలా అన్ని ప్రాంతాలలో భవాని ల సేవలోనే ఉన్నారు.
