Bhavani | ఏరుపెక్కుతున్న ఇంద్రకీలాద్రి…

Bhavani | ఏరుపెక్కుతున్న ఇంద్రకీలాద్రి…

  • అట్టహాసంగా కొనసాగుతున్న దీక్ష విరమణలు…
  • ఆదివారం అమ్మ ఆలయానికి పోటెత్తిన భవానీలు…
  • ఉత్తరాంధ్ర నుండి పెద్ద ఎత్తున రాక…
  • కిక్కిరిస్తున్న రైలు, బస్సులు, ప్రత్యేక వాహనాలు…
  • 3 రోజుల్లో రూ 2.5 కోట్ల రూపాయల ఆదాయం..
  • సోమవారం పూర్ణాహుతితో ముగింపు…
  • విశేష సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు…

Bhavani | ఎన్టీఆర్ బ్యూరో: ఆంధ్రప్రభ : అత్యంత నియమనిష్టలతో పరమ పవిత్రంగా.. భవాని (bhavani) దీక్షలను పూర్తి చేసుకుని వేల సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివస్తున్న భవానీల రాకతో ఇంద్రకీలాద్రి ఎరిపెక్కుతోంది. భవానీ దీక్షలో భాగంగా 41 రోజులు, 21 రోజులు దీక్ష భూనినా భవానీలు అమ్మవారికి పవిత్ర ఇరుముడి సమర్పించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి పక్క రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలి రావడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణంతో పాటు కనకదుర్గ నగర్ గిరిప్రదక్షిణ ప్రాంతాలలో భవానీల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుండి భవానీలు వేల సంఖ్యలో రైళ్లు బస్సులు ఇతర వాహనాల ద్వారా అమ్మవారి దర్శనానికి కోసం నగరానికి చేరుకుంటున్నారు. వారాంతపు సెలవులకు తోడు భవానీల రాక పెరిగిన పరిస్థితులలో రైళ్లు బస్సులు కిటకిటలాడుతున్నాయి. గురువారం నుండి ప్రారంభమైన దీక్ష విరమణ మహోత్సవంలో భాగంగా మూడు రోజుల్లో 3 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా ఆదివారం ఒక్కరోజే లక్షన్నరకు పైగా భవానీళ్లు వచ్చే అవకాశం ఉన్న పరిస్థితులలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను దేవస్థానం అధికారులు చేశారు.

Bhavani

ఉదయం 1 నుండి అమ్మ దర్శనం…
భవానీ దీక్షల విరమణ మహోత్సవంలో భాగంగా 4వ రోజు ఆదివారం వేల సంఖ్యలో భవానీలు వచ్చే అవకాశం ఉన్న ముందస్తు సమాచారంతో అమ్మవారి దర్శనాన్ని ఉదయం 1 నుండి ప్రారంభించారు. విరమణ ఉత్సవాలలో భాగంగా అత్యంత కీలకంగా భావించే ఆదివారం అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుండే భవాని భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లో ఎదురు చూడటం కనిపించింది. సుదూర ప్రాంతాల నుండి కాలినడకన విజయవాడకు చేరుకుంటున్న భవానీలు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఇంద్రకీలాద్రి (Indrakeeladri) చుట్టూ ఎనిమిది కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షణను అత్యంత పవిత్రంగా ఆచరించి అమ్మవారి దర్శనం కోసం వివిధ మార్గాలలో ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మ దర్శనం అనంతరం శివాలయం మెట్లు మార్గం ద్వారా మహా మండపం దిగువ ఏర్పాటు చేసిన దీక్ష విరమణ ప్రాంతంలో పవిత్ర ఇరుముడిని సమర్పించి దీక్ష విరమణ చేస్తున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన హోమగుండంలో నేతి కొబ్బరికాయలు సమర్పించి అమ్మవారి ప్రసాదమైన అన్న ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరిస్తున్నారు. తమకు కావాల్సినన్ని లడ్డూలు అందుబాటులో ఉండడంతో లడ్డు కౌంటర్ల వద్ద లడ్డూలను భక్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. దీక్ష విరమణలో భాగంగా తలనీలాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేశఖండన శాల వద్ద భవానీలు అమ్మవారికి సమర్పిస్తున్నారు.

క్షేత్రస్థాయిలోనే దుర్గ గుడి చైర్మన్..
దీక్ష విరమణ మహోత్సవాలు చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఆదివారం అత్యంత కీలకంగా భావిస్తుండడంతో భవానీలకు ఎక్కడ ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా అవసరమైన ఏర్పాట్లు పర్యవేక్షణను దుర్గగుడి ఛైర్మన్ (Chaimen) బొర్రా గాంధీ క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించడం దగ్గర నుండి క్యూలైన్లలో భవానీలను ఆప్యాయంగా పలకరిస్తూ సౌకర్యాల పట్ల ఆరా తీస్తున్నారు. మహా మండపం దిగున 24 గంటల పాటు ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని పరిశీలించిన ఆయన లడ్డు కౌంటర్లు గిరిప్రదక్షిణ జరుగుతున్న పలు ప్రాంతాలను పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అమ్మ ఆలయానికి విశేష ఆదాయం…
దీక్ష విరమణ మహోత్సవాలలో భాగంగా గడిచిన మూడు రోజుల్లో కనకదుర్గమ్మ వారి ఆలయానికి సుమారు రెండున్నర కోట్ల మేర ఆదాయం సమకూరింది. గురువారం నుండి ప్రారంభమైన దీక్ష విరమణ ఉత్సవాలలో భాగంగా శనివారం (Saturday) అర్ధరాత్రి సమయానికి మూడు రోజుల పాటు అత్యధికంగా ఆదాయం సమకూరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. లడ్డు కొనుగోలు, తలనీలాలలో సమర్పణ వంటి వాటి ద్వారా అమ్మ ఆలయానికి ఆదాయం సమకూరింది. గురువారం సుమారు 60 వేలకు పైగా భవానీలు అమ్మవారిని దర్శించుకోగా శుక్రవారం లక్షమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మూడవ రోజు శనివారం 1,21,000 మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే వేల సంచులో భవానీలు అమ్మవారికి తలనీలాలు సమర్పిస్తుండగా లక్షల లడ్డూలను భవానీలు కొనుగోలు చేస్తున్నారు. భవానీ లందరికీ 24 గంటల పాటు అన్నప్రసాదాన్ని అందుబాటులో ఉంచిన అధికారులు గిరిప్రదక్షిణ జరుగుతున్న ప్రాంతాలలో కూడా భవానీలకు అన్నప్రసాదాన్ని అందుబాటులో ఉంచారు.

భవానిల సేవలో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు…
నిత్యం వేల సంఖ్యలో అమ్మవారి ఆలయానికి తరలివస్తున్న భవానీల సేవలో దుర్గ గుడి ట్రస్ట్ బోర్డు (Trust Board) సభ్యులు తరిస్తున్నారు. ఉత్సవాల ప్రారంభం నాటి నుండి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న వీరు ఉత్సవాల ప్రారంభమైన తరువాత పలు విభాగాలలో భవానీలకు అందుతున్న సేవలను స్వయంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా క్యూలైన్లతో పాటు గిరి ప్రదక్షిణ చేసిన ప్రాంతాలు ఇరుముడులు సమర్పిస్తున్న ప్రాంతం, అన్న ప్రసాదం స్వీకరిస్తున్న ప్రాంతం, లడ్డూలు కొనుగోలు వంటి అతి ముఖ్యమైన ప్రదేశాలలో నిత్యం పర్యటిస్తూ భవానీలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు.

Leave a Reply