Collector | భగవాన్ శ్రీ సత్యసాయి..నిత్య సేవా స్ఫూర్తి..

శ్రీ సత్యసాయి చూపిన మార్గం యువత భవితకు వెలుగు పథం..
స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు శ్రీ సత్యసాయి చూపిన మార్గం ముఖ్యం..
విద్యార్థులు విలువలతో కూడిన విద్యను సముపార్జించాలి..
అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు మార్గంలో పయనించాలి..
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ..
విజయవాడలో ఘనంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలు..
Collector |విజయవాడ ఆంధ్రప్రభ : భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అందించిన స్ఫూర్తి.. తరతరాలకు సేవా దీప్తి అని, ఆయన నడచిన మార్గం, ప్రేమ తత్వానికి, సేవా భావనకు వారధి అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి వేడుకలు ఆదివారం విజయవాడ లోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కలెక్టర్ లక్ష్మీశ.. విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, వివిధ శాఖల అధికారులు, శ్రీ సత్యసాయి సేవా సమితుల సభ్యులు తదితరులతో కలిసి శ్రీ సత్యసాయిబాబా చిత్రపటానికి పూల మాలలు అలంకరించారు.

విశ్వశాంతి, సౌభాగ్యం, మానవాళి సుఖసంతోషాల కోసం పరితపించిన భగవాన్ సేవలను స్మరించుకున్నారు. శ్రీ సత్యసాయి సేవా సమితి సారథ్యంలోని ఆధ్యాత్మిక సేవా, విద్యా విభాగాల ద్వారా అందిస్తున్న సేవలను విజయవాడ సమితి కన్వీనర్ ఎన్వీఎల్ నరసింహారావు వివరించారు. భజనల కార్యక్రమాల ఆధ్యాత్మిక పరిమళాలతో ప్రాంగణం శోభిల్లగా శ్రీ సత్యసాయి వాక్కులను వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో శ్రీ సత్యసాయిబాబా శతజయంతిని పండగలా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఇదో గొప్ప కార్యక్రమమని.. సమాజంలోని సమస్యలను అర్థం చేసుకొని వాటి పరిష్కారానికి శ్రీ సత్యసాయి గొప్ప ఆలోచనలు చేసి అందరికీ ఆదర్శవంతంగా నిలిచారన్నారు. ఆయన సేవా స్పూర్తి తరంగాలు నేడు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు అనే గొప్ప భావనలు ముఖ్యంగా ఈ తరానికి చాలా కీలకమని పేర్కొన్నారు.

విద్యార్థులు విలువలను పెంపొందించుకుంటూ ముందడుగు వేయాలని.. శ్రీ సత్యసాయి వాక్కులను సమగ్ర అభివృద్ధికి మార్గాలుగా చేసుకోవాలన్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు శ్రీ సత్యసాయి చూపిన విలువల మార్గం, ఆశయాలు, ఆదర్శాలు, ఆలోచనలు కీలకమని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు సీహెచ్ సాయిగీత, ఝాన్సీ, విజయలక్ష్మి, తులసీరాం తదితరులు పాల్గొన్నారు
