భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
- యానాల దామోదర్ రెడ్డి
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని న్యూ గుండ్లపల్లి గ్రామంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల 95వ వర్ధంతిని పురస్కరించుకుని రెండు రోజులుగా నిర్వహించిన వాలీబాల్ పోటీలు ఘనంగా ముగిశాయి.
ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యానాల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదురించి, కేవలం 23 ఏళ్ల వయసులోనే ఉరిశిక్షను చిరునవ్వుతో స్వీకరించిన మహనీయులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ అని కొనియాడారు.
నేటి యువత మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా, మంచి మార్గంలో నడిచి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. భగత్ సింగ్ వంటి విప్లవకారుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోదా శ్రీరాములు మాట్లాడుతూ.. “స్టాప్ డ్రగ్స్ – స్టార్ట్ స్పోర్ట్స్” అనే నినాదంతో అఖిల భారత యువజన సమాఖ్య యువతను క్రీడల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉన్నత విద్యను అభ్యసించి మంచి భవిష్యత్తు సాధించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం కృష్ణ, కొల్లూరు రాజయ్య, బండి జంగమ్మ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెరబోయిన మహేందర్, సిపిఐ పట్టణ కార్యదర్శి, కౌన్సిలర్ బబ్బురి శ్రీధర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్, మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు పెరబోయిన పెంటయ్య, కంబాల వెంకటేష్, కంబాల నరసింహ, సాయి తేజ, మహేష్, శేఖర్, అరవింద్, శెట్టి నరసింహ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
