జన్నారం, ఏప్రిల్ 7(ఆంధ్రప్రభ ) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాలకు చెందిన ఎం.డి ఎజాజోద్దీన్, రియాజోద్దీన్ లు ఇందనపల్లి రేంజ్ లోని భర్తన్ పేట ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రుబీనా తలత్ పై దాడి చేసి, నానా బూతులు తిట్టారని ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై గుండేటి రాజవర్ధన్ సోమవారం తెలిపారు. ఈనెల 4న కవ్వాల టైగర్ రిజర్వ్ లోని భర్తన్ పేట రిజర్వ్ ఫారెస్ట్ లోని కంపార్ట్ మెంట్ నెంబరు 242లోని అడవిలోకి ఓ ట్రాక్టర్ వచ్చి ఇసుక నింపుతుండగా, ఆ విషయాన్ని తెలుసుకొని రుబీనా తలత్ భర్తతో కలిసి అక్కడికి వెళ్ళగా ఎం.డి ఎజాజోద్దీన్, రియాజోద్దీన్ లు చేయి పట్టి లాగి, కర్రతో కొట్టారని ఆమె చెప్పారు.
ఈ విషయమై లక్షేటిపేట సీఐ అల్లం నరేందర్ కు, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై రాజవర్ధన్ కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో భర్తన్ పేట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ హన్మంతరావు పాల్గొన్నారు.