నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భంలోనే శిశువు మృతి

కాన్పు కోసం వచ్చిన గర్భిణి
ప్రసవానికి మరో వారం రోజులు పడుతుందన్న డాక్టర్లు
ప్రసవ వేదనతో తల్లడిల్లిన గర్భిణి
కడుపులోని శిశువు మృతి చెందిందని కాన్పు చేసిన వైద్యులు
వైద్యుల నిర్లక్ష్యం పై ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
మహిళ పరిస్థితి విషమం
ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కాన్పు కోసం వచ్చిన మహిళకు సకాలంలో వైద్యం అందించకపోవడంతో తల్లి గర్భంలోనే శిశువు మృతి చెందగా మహిళ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు బుధవారం జీజీహెచ్ ఎదుట మృత శిశువుతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన కడమంచి మహేష్ తన భార్య రేణుకకు పురిటి నొప్పులు వస్తుండడంతో బుధవారం ఉదయం భార్య రేణుకను తీసుకొని కాన్పు కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు కాన్పు కావడానికి మరో వారం రోజులు పడుతుందని చెప్పడంతో టిఫిన్ చేయడానికి ఆసుపత్రి బయటకు వచ్చి టిఫిన్ చేస్తున్న సమయంలో రేణుకకు మరోసారి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడు రేణుకను పరీక్షించిన వైద్యులు గర్భంలోనే శిశువు మృతి చెందిందని రెండు రోజుల క్రితమే శిశువు మృతి చెంది ఉంటుందని చెప్పి కాన్పు చేసి మృత శిశువును బయటికి తీశారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే గర్భంలోనే శిశువు మృతి చెందిందని నిర్లక్ష్యంగా వైద్యం చేసిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ఆసుపత్రి ఆవరణ ఒక్కసారిగా ఉద్రిక్త తగా మారింది.
ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు.
డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అరుణ కుమారి చెప్పారు. రెండు రోజుల క్రితమే గర్భంలో శిశువు మృతి చెందిందని ఆ విషయం వారికి స్పష్టంగా చెప్పిన తర్వాతే డెలివరీ చేశామని చెప్పారు.
