అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి, అయోధ్య ధామ్ ఆచార్య సత్యేంద్ర కుమార్ దాస్ మహారాజ్ ఈరోజు ఉదయం అనారోగ్యంతో మృతి (died) చెందినట్లు అధికారులు తెలిపారు. 83 ఏళ్ల వయసున్న పూజారి.. ఫిబ్రవరి 3న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లక్నో ఆసుపత్రిలో చేరారు. గత తొమ్మిది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆయన మరణవార్తను తెలుసుకున్న ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు “శ్రీరాముని పరమ భక్తుడు, శ్రీ రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి శ్రీ అయోధ్య ధామ్ ఆచార్య శ్రీ సత్యేంద్ర కుమార్ దాస్ మహారాజ్ మరణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు. ఆయన మరణానికి నా వినయపూర్వకమైన నివాళి! పరమేశ్వరుడు శ్రీరాముని పాదాల చెంత ఆయనకు చోటు కల్పించాలని, దుఃఖంలో ఉన్న శిష్యులకు, అనుచరులకు ఈ తీరని నష్టాన్ని భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం.” అని సీఎం యోగి రాసుకొచ్చారు.