Awereness | మెసేజీలు నమ్మొద్దు
- తెలియని లింకుల జోలికి వెళ్లొద్దు
- మత్తు వద్దు బ్రో
- సైబర్ కేటుగాళ్లపై అప్రమత్తం అవసరం
- సైబర్ నేరాల నియంత్రణపై పోలీసుల అవగాహన
Awereness | ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు : చిత్తూరు జిల్లాలో సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలు, మత్తుమందుల దుష్ప్రభావాలు, రోడ్డు భద్రతపై అంతటా విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను జిల్లా పోలీసులు(District Police) విస్తృతంగా నిర్వహిస్తున్నారు. చిత్తూరు పట్టణంలోని శ్రీ విద్యా కళాశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ మహేశ్వర, చిత్తూరు క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ఉమామహేశ్వర రావు(Umamaheswara Rao) పాల్గొని విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో యువత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.
సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలని, తెలియని లింకులు, అనుమానాస్పద సందేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరాదని సూచించారు..ఈ సందర్భంగా 1 టౌన్ ఇన్ స్పెక్టర్(1 Town Inspector) మహేశ్వర మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మత్తుమందుల వాడకం వల్ల వ్యక్తి భవిష్యత్తే కాకుండా కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని హెచ్చరించారు. జీవిత లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని చదువుతో పాటు క్రమశిక్షణను అలవర్చుకుంటే సమాజాభివృద్ధికి యువత కీలక పాత్ర పోషించగలరని అన్నారు.

క్రైమ్ ఇన్ స్పెక్టర్ ఉమామహేశ్వర రావు సైబర్ నేరాలపై విపులంగా వివరించారు. ఇటీవల వెలుగులోకి వస్తున్న డిజిటల్ అరెస్ట్ అనే కొత్త మోసపూరిత విధానంపై విద్యార్థులను అప్రమత్తం చేశారు. కొందరు మోసగాళ్లు సైబర్ పోలీసులుగా నటిస్తూ వీడియో కాల్స్(Video calls) లేదా ఫోన్ ద్వారా మీపై కేసు నమోదైంది అంటూ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి కాల్స్‌కు భయపడకుండా వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిజమైన పోలీసులు ఎప్పటికీ డిజిటల్‌గా ఎవరినీ అరెస్ట్ చేయరని, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీ వంటి వాటిని ఎవరికీ తెలియజేయకూడదని హెచ్చరించారు(Warned). అవగాహనతోనే సైబర్ నేరాల నుంచి రక్షణ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో సుమారు 250 మంది విద్యార్థులు అధ్యాపకులు పాల్గొని, పోలీసులిచ్చిన సూచనలను ఆసక్తిగా విన్నారు.

